Telugu Global
Telangana

ఆరు గ్యారెంటీలపైనే కాంగ్రెస్ ఫోకస్

ఓట్లకోసం ఈ పథకాలను తాము ప్రకటించలేదని, సాధ్యా సాధ్యాలను పరిశీలించే ఈ నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. హామీలిచ్చి వదిలేయడం కాంగ్రెస్ కి అలవాటు లేదని.. కచ్చితంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు ఖర్గే.

ఆరు గ్యారెంటీలపైనే కాంగ్రెస్ ఫోకస్
X

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలపై ఫోకస్ పెంచింది. ఓవైపు అధికార బీఆర్ఎస్ నుంచి విమర్శలు వినిపిస్తున్నా.. వాటికి ఏమాత్రం కౌంటర్ ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. కర్నాటకలో కరెంటు కష్టాలు కాంగ్రెస్ కి తెలంగాణలో మైనస్ కాబోతున్నాయి. ఈ దశలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆరు గ్యారెంటీలను పదే పదే ఏకరువు పెట్టడం విశేషం.


సంగారెడ్డిలోని గంజి మైదాన్‌ లో కాంగ్రెస్‌ కార్నర్ మీటింగ్‌ జరిగింది. ఈ సభకు మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాంగ్రెస్‌ పేదల కోసం ఆలోచిస్తుందని చెప్పారు. కర్నాటకలో ఈరోజు మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని చెప్పారాయన. తెలంగాణ ఎవరు ఇచ్చారు? ఎవరి కోసం ఇచ్చారంటూ సంగారెడ్డి వాసులను ప్రశ్నించారు ఖర్గే. తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా ఇంటికెళ్లి మరీ కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారని గుర్తు చేశారు.

తెలంగాణకు ఇందిర చేసిన మేలు..

ఇందిరా గాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టి దేశమంతా కాంగ్రెస్‌ ను గెలిపించారని చెప్పారు ఖర్గే. ఇందిరా గాంధీ హయాంలోనే BHEL, BDL, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యాయని చెప్పారు. ఇందిర ఇక్కడి నుంచి గెలవకపోయి ఉంటే ఈ సంస్థలు సాధ్యామయ్యేవా? అని ప్రశ్నించారు ఖర్గే. ఇప్పుడున్న ప్రభుత్వం సంస్థలను అమ్మేస్తోందన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరిపై 5 లక్షల రూపాయల అప్పు ఉందని ఆరోపించారు ఖర్గే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను గ్యారెంటీగా అమలు చేస్తామని చెప్పారాయన. ఓట్లకోసం ఈ పథకాలను తాము ప్రకటించలేదని, సాధ్యా సాధ్యాలను పరిశీలించే ఈ నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. హామీలిచ్చి వదిలేయడం కాంగ్రెస్ కి అలవాటు లేదని.. కచ్చితంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు ఖర్గే.

First Published:  29 Oct 2023 12:04 PM GMT
Next Story