రేపే కాంగ్రెస్ తొలి జాబితా..! కుదరకపోతే దసరాకే ముహూర్తం
రాష్ట్రంలో 70 స్థానాలకు అభ్యర్థుల ప్రకటనకు జాబితా సిద్ధంగా ఉందని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తెలిపారు. ఒకవేళ ఆదివారం లిస్ట్ విడుదలపై వెనకడుగు వేస్తే, దసరా రోజు పొత్తు స్థానాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.

ఎట్టకేలకు కాంగ్రెస్ తొలిజాబితా సిద్ధమైంది. 70మందితో ఫస్ట్ లిస్ట్ రెడీ చేసింది అధిష్టానం. అయితే ఆ జాబితాలోని పేర్లు ప్రకటించడానికే కాస్త ముందూ వెనకా ఆలోచిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు(ఆదివారం) తొలి జాబితా ప్రకటిస్తారని అంటున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో ట్విస్ట్ లు ఉంటే మాత్రం దసరాకు మొత్తం లిస్ట్ బయటకు వచ్చే అవకాశముంది.
ఎందుకింత ఆలస్యం..?
ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. షెడ్యూల్ విడుదలకు ముందే బీఆర్ఎస్ ప్రచార పర్వం స్పీడందుకుంది, ఇప్పుడు మరింత జోరుగా సాగుతోంది, అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీ ఫామ్ లు ఇచ్చేసి, బహిరంగ సభలను మొదలు పెడితే ప్రచారం పీక్స్ కి చేరుతుంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ మాత్రం అభ్యర్థులను వెదుక్కునే పనిలో ఉన్నాయి. కప్పదాటు నాయకులకే ప్రయారిటీ ఇస్తూ వారిపైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకే కాంగ్రెస్ కూడా వెదుకులాటకు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టలేదు. వివిధ వడపోతల తర్వాత ఎట్టకేలకు 70 మందిని మాత్రం ఫైనల్ చేసింది అధిష్టానం. పొత్తులకు 6 స్థానాలు కేటాయించగా.. మరో 43 స్థానాల్లో గట్టిపోటీ ఉందని చెబుతోంది.
పొత్తులపై తేల్చని అధిష్టానం..
కాంగ్రెస్ పార్టీ ఇంకా పొత్తులపై తేల్చలేదు. వామపక్షాలకు ఇవ్వాల్సిన సీట్ల విషయంలో చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. బీసీలకు ఇవ్వాల్సిన 34 సీట్లలో కూడా భారీగా కోతపెట్టినట్టు తెలుస్తోంది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ని పక్కనపెట్టేశారు, మరోవైపు బీసీల డిమాండ్లు నెరవేర్చలేదు, ఇంకోవైపు పార్టీని నమ్ముకున్నవారికి కాకుండా ప్యారాచూట్ నేతలకు వెంటనే పని జరిగిపోతోంది. అసలు కాంగ్రెస్ టికెట్ల ప్రకటన కంగాళీగా మారిపోయింది. రాష్ట్రంలో 70 స్థానాలకు అభ్యర్థుల ప్రకటనకు జాబితా సిద్ధంగా ఉందని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తెలిపారు. ఒకవేళ ఆదివారం లిస్ట్ విడుదలపై వెనకడుగు వేస్తే, దసరా రోజు పొత్తు స్థానాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.