కొత్తగూడెం కాంగ్రెస్‌లో సీపీఐ చిచ్చు
కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఎడవల్లి కృష్ణ పార్టీ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
సీపీఐతో పొత్తు కొత్తగూడెం కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. దీంతో కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆశావహులు పార్టీ తీరుపై మండిపడుతున్నారు. ఏ సర్వే ఆధారంగా కొత్తగూడెం సీటును సీపీఐకి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఎడవల్లి కృష్ణ పార్టీ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నైతిక విలువలు లేని సీపీఐ కోసం కాంగ్రెస్ కొత్తగూడెం సీటును వదులుకోవడం సరికాదన్నారు. సీపీఐ పతనం ప్రారంభమైందన్నారు. కష్టపడి పనిచేసిన వారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందన్నారు. తాను తీసుకోబోయే నిర్ణయంతో కలిసిరావాలని క్యాడర్‌ను కోరారు. టికెట్ రాకపోవడంతో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు ఎడవల్లి కృష్ణ.
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదరడంతో ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. కొత్తగూడెం నుంచి సీపీఐ పార్టీ తరపున కూనంనేని సాంబశివరావు బరిలో ఉంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐకి కాంగ్రెస్ స్థానిక కార్యకర్తలు ఏ మేరకు సహకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.