రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ కి కౌంట్ డౌన్..
ఎద్దు ఏడ్జిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదని అన్నారు కేటీఆర్. ఈరోజు నుంచి రైతన్నల చేతిలో కాంగ్రెస్ సర్కారుకి కౌంట్ డౌన్ మొదలైందని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హామీల అమలులో మీనమేషాలు లెక్కిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేశామని చెబుతున్నా.. అందులో పూర్తి స్థాయిలో ఒక్క గ్యారెంటీ కూడా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ప్రతి పథకంలోనూ కొర్రీలు, కోతలు కామన్ గా మారిపోయాయి. తాజాగా వరిపంటకు ఇచ్చే బోనస్ విషయంలో కాంగ్రెస్ నాలుక మడతేసింది. కేవలం సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ అని కేబినెట్ లో తీర్మానించింది. ఎన్నికల ముందు మాత్రం ఇలాంటి కండిషన్లేవీ పెట్టకుండానే హామీ ఇచ్చింది, ఎన్నికలయ్యాక మాత్రం తిరకాసులు పెడుతోంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కపట కాంగ్రెస్ మార్క్ మోసం అని, దగా, నయ వంచన అంటూ ట్వీట్ వేశారు.
ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన..
— KTR (@KTRBRS) May 21, 2024
గ్యారెంటీ కార్డులో..
“వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి..
ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని
సన్నాయి నొక్కులు నొక్కుతారా ??
ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి..
ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ??
ఇది ప్రజా పాలన కాదు..… pic.twitter.com/9GZoIIFJyz
గ్యారెంటీ కార్డులో..
“వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి..
ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని
సన్నాయి నొక్కులు నొక్కుతారా ??
ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి..
ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ??
ఇది ప్రజా పాలన కాదు..
రైతు వ్యతిరేక పాలన అంటూ ధ్వజమెత్తారు కేటీఆర్.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాగునీరు ఇవ్వకుండా చావగొట్టారని, కరెంట్ కోతలతో పంటలను ఎండబెట్టారని, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారని అన్నారు కేటీఆర్. రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా అని చెప్పి ఇవ్వలేదని, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఆర్థిక సాయం ఇవ్వలేదని, రుణమాఫీ చేయలేదని గుర్తు చేశారు. బోనస్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన బోగస్ విధానాన్ని బయటపెట్టిందని చెప్పారు కేటీఆర్. ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం అని దుయ్యబట్టారు.
ఎద్దు ఏడ్జిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదని అన్నారు కేటీఆర్. నమ్మి ఓటు వేసినందుకు రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు వదిలిపెట్టరని, కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారని చెప్పారు. ఈరోజు నుంచి రైతన్నల చేతిలో కాంగ్రెస్ సర్కారుకి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు కేటీఆర్.