Telugu Global
Telangana

కవితకు బెయిల్ ఎందుకొచ్చిందంటే..?

ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని కేసీఆర్ గతంలో చెప్పిన మాటల్ని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. రాత్రి 7 గంటలకు కవిత జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి.

కవితకు బెయిల్ ఎందుకొచ్చిందంటే..?
X

ఎమ్మెల్సీ కవిత బెయిల్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతల కంటే ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. బీజేపీతో లాలూచీ పడటం వల్ల బెయిలొచ్చిందని కాంగ్రెస్ నేతలు అంటుంటే, కాంగ్రెస్ నేతలే కవిత బెయిల్ కి కారణం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి నేతలు చెబుతున్నారు. మొత్తమ్మీద కవిత బెయిల్ అంశంపై బీఆర్ఎస్ రియాక్షన్స్ కంటే కాంగ్రెస్, బీజేపీ నుంచే ఎక్కువ స్పందనలు రావడం విశేషం.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ వ్యవహారంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న సంబంధం బయటపడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలవుతుందని జోస్యం చెబుతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మహేశ్ కుమార్ గౌడ్ సహా మరికొందరు నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు.

అటు కవిత బెయిల్ తో న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కవిత బెయిల్ తీర్పు నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు సహా కీలక నేతలు ఈరోజు సుప్రీంకోర్టు వద్దకు వెళ్లారు. బెయిల్ తీర్పు రావడంతో పలువురు నేతలు కేటీఆర్ ని అభినందించారు. న్యాయం గెలిచిందని చెప్పారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని కేసీఆర్ గతంలో చెప్పిన మాటల్ని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. కవిత తప్పు లేదని తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగానే ఈడీ, సీబీఐ ఆమెను టార్గెట్ చేశాయని, పలు సందర్భాల్లో బెయిల్ రాకుండా వారు అడ్డుకున్నారని, చివరకు బెయిల్ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శిబిరంలో సంతోషం నెలకొంది. రాత్రి 7 గంటలకు కవిత జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి.

First Published:  27 Aug 2024 9:57 AM GMT
Next Story