Telugu Global
Telangana

అమెరికాలో అసెంబ్లీ టికెట్ల అమ్మకం..! రేవంత్ పై అధిష్టానం గరంగరం

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో టికెట్ల అమ్మకం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం మరింత హాట్ హాట్ గా సాగింది. చివరకు రేవంత్ పై కమిటీ చైర్మన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అమెరికాలో అసెంబ్లీ టికెట్ల అమ్మకం..! రేవంత్ పై అధిష్టానం గరంగరం
X

ఆ మధ్య అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి రెండు సంచలనాలు సృష్టించారు. సీతక్క సీఎం అభ్యర్థి అయితే తప్పేంటన్నారు. తెలంగాణలో రైతులకు మూడు గంటలు విద్యుత్ చాలని చెప్పారు. ఆ సంచలన ప్రకటనల చుట్టూ కొన్నాళ్లు వాద ప్రతివాదాలు జరిగాయి. కానీ అంతకు మించి ఆయనకు అమెరికా పర్యటన కీలకంగా మారిందని ఇప్పుడు వార్తలొస్తున్నాయి. అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి అసెంబ్లీ టికెట్లు అమ్ముకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలు కూడా కాంగ్రెస్ నేతలే చేస్తున్నారు. ఆషామాషీ వ్యక్తులు కాదు, పార్టీకి నమ్మకస్తులే రేవంత్ ని టార్గెట్ చేశారు. దీంతో అధిష్టానం కూడా ఆలోచనలో పడింది. కాంగ్రెస్ టికెట్ల ఖరారు కోసం తాజాగా ఢిల్లీలో జరిగిన వార్ రూమ్ భేటీలో రేవంత్ రెడ్డిపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం జరిగే సమయంలో ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీస్ ముందు విద్యార్థి నేతల నిరసన కూడా కలకలం రేపింది.

వార్ రూమ్ లో ఏం జరిగింది..?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకుంది. అదే సమయంలో పార్టీ ఇంటర్నల్ గా సర్వేలు చేపట్టింది. ఆ సర్వేలో మంచి ఫలితాలు వచ్చినవారికే టికెట్లు ఇస్తామంది. సర్వే లిస్ట్ వ్యవహారంలోనే గందరగోళం జరిగింది. రేవంత్ రెడ్డి చొరవతో కొంతమంది అనామకులకు కూడా ఆ లిస్ట్ లో చోటు దక్కిందనే ఆరోపణలు వినపడుతున్నాయి. దాదాపుగా టికెట్ల కేటాయింపులు తుది దశకు చేరుకున్న తర్వాత కొత్తగా కొందరి పేర్లను రేవంత్ రెడ్డి ఎందుకు తెరపైకి తెస్తున్నారని వార్ రూమ్ మీటింగ్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దబాయించి అడిగాడని అంటున్నారు. తాను పీసీసీ అధ్యక్షుడినని, పార్టీ విషయంలో ఏం చేయాలో తనకు తెలుసని రేవంత్ సమాధానమివ్వడంతో మాటా మాటా పెరిగింది. రాహుల్ గాంధీ దగ్గర విషయం తేల్చుకుందామంటూ ఇద్దరూ సవాళ్లు విసురుకున్నారు. చివరకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. గతంలో హైదరాబాద్ గాంధీభవన్ మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఇలాంటి వాదనే జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డిని మిగతావాళ్లు టార్గెట్ చేశారు. ఈ సారి ఆయన టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

36 టికెట్లకు బేరం..

అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి 36 అసెంబ్లీ స్థానాల టికెట్ల విషయంలో బేరాలు కుదుర్చుకున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన కొత్త మనోహర్ రెడ్డి ఏ నియోజకవర్గం టికెట్ ఏ రేటు పలికిందో వివరాలతో సహా బయటపెట్టారు. తన వాదన తప్పయితే రేవంత్ రెడ్డి, హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రమాణం చేయాలని కూడా కొత్త మనోహర్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఆ సంగతి అటుంచితే, ఇప్పుడు అమెరికాలో టికెట్ల అమ్మకం అనేది హైలైట్ గా మారింది. కాంగ్రెస్ టికెట్ల ప్రకటనను మరిన్ని రోజులు వెనక్కి నెట్టింది.

రేవంత్ రెడ్డిపై సొంత పార్టీలో వినపడుతున్న అసమ్మతి, టికెట్ల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్, బీజేపీకి వరంగా మారాయి. రేవంత్ రెడ్డిని రేటెంత రెడ్డి అంటూ కామెంట్ చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటోంది, ఆ పార్టీకి ఓటేస్తే రేపు రాష్ట్రాన్నే అమ్మేస్తుంది అంటూ సెటైర్లు పేల్చారు మరో మంత్రి హరీష్ రావు. మొత్తానికి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో టికెట్ల అమ్మకం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వార్ రూమ్ భేటీ మరింత హాట్ హాట్ గా మారింది.


First Published:  9 Oct 2023 11:51 AM IST
Next Story