Telugu Global
Telangana

పొ‍ంగులేటి, జూపల్లిల కోసం కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ

పొంగులేటిని ఢిల్లీ తీసుకెళ్ళి అధిష్టానంతో సమావేశం ఏర్పాటు చేయ‌డానికి సంజయ్ ప్రయత్నం చేసినప్పటికీ పొంగులేటి వెళ్ళడానికి సిద్దపడలేదు. అలాగే డీకే అరుణ, జూపల్లిని ఢిల్లీకి తీసుకెళ్ళే ప్రయత్న‍ం చేశారు. కాని అందులో ఆమె విజయవంతం కాలేదు.

పొ‍ంగులేటి, జూపల్లిల కోసం కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ
X

ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణా రావులను భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి వారిద్దరినీ తమవైపు లాక్కోవడానికి కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

పొంగులేటితో ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం. పొంగులేటి, జూపల్లిలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, డీకే అరుణ, కిషన్ రెడ్డిలు చర్చలు జరపడమే కాక వారితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొంగులేటి సూచించిన వ్యక్తులకే ఎమ్మెల్యే టిక్కట్లు ఇవ్వడానికి కూడా బీజేపీ సిద్దంగా ఉంది. ఐనప్పటికీ ఆయన గానీ, జూపల్లికానీ బీజేపీ లో చేరతామని , చేరమని ఎటూ తేల్చలేదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు.

పొంగులేటిని ఢిల్లీ తీసుకెళ్ళి అధిష్టానంతో సమావేశం ఏర్పాటు చేయ‌డానికి సంజయ్ ప్రయత్నం చేసినప్పటికీ పొంగులేటి వెళ్ళడానికి సిద్దపడలేదు. అలాగే డీకే అరుణ, జూపల్లిని ఢిల్లీకి తీసుకెళ్ళే ప్రయత్న‍ం చేశారు. కాని అందులో ఆమె విజయవంతం కాలేదు.

మరో వైపు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ ఇద్దరు నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి తీవ్ర ప్రయత్నమే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా ఆ ఇద్దరు నాయకులతో టచ్ లో ఉన్నారు. తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కూడా ఆ ఇద్దరు నాయకులతో మాట్లాడినట్టు సమాచారం.

తాజాగా రాహుల్ గాంధీ టీం పొంగులేటితో సమావేశమయ్యింది. పోంగులేటితో రాహుల్ టీం ఆయన ఇంట్లోనే దాదాపు ఆరు గంటలపాటు నిన్న రాత్రి సమావేశమై చర్చలు జరిపారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందువల్ల ఆయన డిమాండ్లకు కొద్దిగా అటు ఇటుగా కాంగ్రెస్ నాయకత్వం సై అంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, భద్రాచలం తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో పొంగులేటి సూచించిన వ్యక్తులకే టిక్కట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్దమయ్యింది. ఆయన చేరితే ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో స్వీప్ చేయవచ్చని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం రాహుల్ టీం చేసింది. మధిరలో భట్టి విక్రమార్క, భద్రాచలం లో పోదెం వీరయ్య ప్రస్తుతం కా‍ంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అందువల్ల ఆ రెండు నియోజకవర్గాలు వదిలేసి మిగతా అన్నీ ఆయన ఇష్టానికే వదిలేయడానికి కాంగ్రెస్ సిద్దంగా ఉంది.

మరో వైపు జూపల్లితో ఠాక్రే సమావేశమైనట్టు సమాచారం. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, బీఆరెస్ ఓటమి తప్పదని, బీజేపీకి గెలిచే అవకాశంలేదని జూపల్లికి ఠాక్రే వివరించినట్టు తెలుస్తోంది. రేవంత్ కూడా జూపల్లికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

అయితే ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్ నాయకత్వానికి అవునని కానీ, కాదని కానీ చెప్పకుండా త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్ల‌డిస్తామని చెప్పినట్టు సమాచారం.

మరో వైపు ఈ రోజు, వీరిద్దరితో సహా, మరికొందరు నాయకుల‌ చేరికలపై మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరుగుతున్న ఈ సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులను చేర్చుకోవడంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అదేవిధంగా పార్టీలో అసంత్రుప్త‌ నేతలను బుజ్జగించేందుకు చేపట్టవలసిన చర్యలపై కూడా వీరిద్దరూ చర్చిస్తున్నారు.

మొత్తానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ప్రస్తుతం హాట్ సెల్లర్స్ గా ఉన్నారు. చివరకు వారిద్దరు ఎవరి గూట్లో చేరుతారో వేచి చూడాలి.

First Published:  17 April 2023 2:34 PM IST
Next Story