మునుగోడులో కాంగ్రెస్ యాక్షన్ ! ఆ నలుగురిపై వేటు !
రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటించిన వెంటనే కదలిక ప్రారంభమైంది, చకాచకా నిర్ణయాలు సాగుతున్నాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వెంట తిరుగుతున్న మండలాధ్యక్షులపై వేటు వేసింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా రాజీనామా ప్రకటించారో లేదో.. అలా కాంగ్రెస్ యాక్షన్‌లోకి దిగింది. ఇప్పటికే మధుయాష్కీ నేతృత్వంలో కమిటీని ప్రకటించింది. ఐదున నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా కార్యక్రమం చేపట్టింది.
కాంగ్రెస్‌లో ఏదైనా చర్య తీసుకోవాలంటే... హైకమాండ్ ఆదేశాలు అంటూ సాగదీస్తారు.కానీ రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటించిన వెంటనే కదలిక ప్రారంభమైంది, చకాచకా నిర్ణయాలు సాగుతున్నాయి.
ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వెంట తిరుగుతున్న మండలాధ్యక్షులపై వేటు వేసింది. రాజగోపాల్ రెడ్డికి సహకరిస్తున్నారని మునుగోడు మండల పార్టీ అధ్యక్షుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, చండూరు మండల పార్టీ అధ్యక్షుడు పల్లె వెంకన్న గౌడ్, నాంపల్లి మండల అధ్యక్షుడు పూల వెంకటయ్య, మర్రిగూడ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, చండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దోటి వెంకన్నను పార్టీ నుంచి బహిష్కరించింది. నల్గొండ డిసిసి అధ్యక్షుడు ఈమేరకు ప్రకటన విడుదల చేశారు.
ఇటు వరుస ప్రెస్‌మీట్లతో రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. 600 కోట్లు కూడా లేని రాజగోపాల్ కంపెనీలకు మూడు వేల కోట్ల కాంట్రాక్ట్‌లు ఎలా వస్తాయని కాంగ్రెస్‌నేత బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు.
ఇటు రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మలను యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో తగులబెట్టారు. అధిష్టానం ఆదేశాలో తెలియదు. కాంగ్రెస్‌లో వచ్చిన మార్పో తెలియదు. కానీ రాజగోపాల్ యాక్షన్‌కు కాంగ్రెస్ నుంచి రియాక్షన్ మాత్రం లేటు కావడం లేదు.