వివేక్ రాజీనామాతో బీజేపీ మేనిఫెస్టోపై గందరగోళం..!
మేనిఫెస్టో కమిటీ రెండు సార్లు మినహా పెద్దగా సమావేశం కాలేదు. ఇప్పుడు వివేక్ రాజీనామాతో ఆ బాధ్యత మిగతా సభ్యులపై పడింది.
తెలంగాణ బీజేపీలో గందరగోళం నెలకొంది. వివేక్ వెంకటస్వామి రాజీనామాతో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లయింది. ఇదే సమయంలో ఆ పార్టీ మేనిఫెస్టోపైనా సస్పెన్స్ నెలకొంది. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్న వివేక్ రాజీనామా చేయడంతో పరిస్థితి తారుమారైంది.
తెలంగాణ బీజేపీ గ్రూప్‌వార్‌ను కంట్రోల్ చేసేందుకు పార్టీ అధినాయకత్వం వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆందోళనలు, బహిరంగసభలు, ఎన్నికలకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేసింది. మేనిఫెస్టో కమిటీలో 29 మంది నేతలున్నారు. ఈ కమిటీలో కొత్త, పాత నేతలకు అవకాశం ఇచ్చారు ఢిల్లీ పెద్దలు.
మేనిఫెస్టో కమిటీ రెండు సార్లు మినహా పెద్దగా సమావేశం కాలేదు. ఇప్పుడు వివేక్ రాజీనామాతో ఆ బాధ్యత మిగతా సభ్యులపై పడింది. ఎన్నికలకు మరో 28 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ.. ఆ పార్టీ నేతలు మేనిఫెస్టోపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇక కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తుండటంతో చాలా మంది పాత నేతలు సమావేశాలకు హాజరుకావట్లేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి దూసుకెళ్తుండగా.. బీఆర్ఎస్ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో పోల్చితే పోటీలో బీజేపీ ఎక్కడో వెనుకబడిపోయింది. మేనిఫెస్టో సంగతేమో కానీ.. పార్టీ వీడుతున్న నేతలను కాపాడుకోవడమే కమలనాథులకు పెద్దసవాల్‌గా మారింది.