Telugu Global
Telangana

ఒకే నియోజకవర్గంలో ముగ్గురి 'జోడో' యాత్రలు.. ఆయోమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా.. ప్రతీ రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో యాత్రకు అనుమతులు ఇస్తోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తొలి విడత యాత్ర చేస్తున్నారు.

ఒకే నియోజకవర్గంలో ముగ్గురి జోడో యాత్రలు.. ఆయోమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు
X

కాంగ్రెస్ పార్టీ తీరే వేరు. మాకు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకుంటూ.. అప్పుడే తిట్టుకుంటారు.. మరో రోజు కలుసుకుంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆ పార్టీ తీరుతెన్నులే అలా ఉంటాయి. కేంద్రంలో బీజేపీ అధికారం చెలాయిస్తుందంటే.. అందుకు ఆ పార్టీ బలంగా ఉందని కాదు.. కాంగ్రెస్ బలహీన పడిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుంటారు. నిజమే.. గత ఎనిమిదిన్నర ఏళ్లుగా తెలంగాణలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. తిరిగి గెలవడానికి రెండడుగులు ముందుకు.. నాలుగడుగులు వెనక్కు వేస్తోంది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా.. ప్రతీ రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో యాత్రకు అనుమతులు ఇస్తోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తొలి విడత యాత్ర చేస్తున్నారు. మరో వైపు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు కూడా ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నారు. కాగా, దుబ్బాక నియోజకవర్గంలో ఏకంగా ముగ్గురు కాంగ్రెస్ ఆశావహులు యాత్రలు చేస్తుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అసలు ఏ నాయకుడి వెంట తిరగాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి 'ఆత్మ గౌరవ యాత్ర' పేరుతో గత 12 రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రతీ గ్రామాన్ని కవర్ చేస్తూ రాబోయే ఎన్నికల్లో తిరిగి తనకే సీటు వస్తుందని.. తప్పకుండా ఆదరించాలని కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దుబ్బాక నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డే నిలబడ్డారు. ఒకవైపు శ్రీనివాస్ రెడ్డి యాత్ర కొనసాగుతుండగానే మరో నాయకుడు శ్రవణ్ కుమార్ రెడ్డి జోడో యాత్ర అంటూ నడక మొదలు పెట్టారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ గ్యారెంటీ అని చెప్పుకుంటూ శ్రవణ్ కుమార్ రెడ్డి జోడో యాత్ర చేస్తున్నారు. తనకే అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయంటూ ఆయన జోరుగా నడక సాగిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి మధ్యే నలిగిపోతున్నామని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్న సమయంలో కొత్తగా కత్తి కార్తీక ఎంటర్ అయ్యింది.

గతంలో మీడియాలో పని చేసి కాస్త గుర్తింపు తెచ్చుకున్న కార్తీక రాబోయే ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం దుబ్బాకలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఎక్కువ రోజులు అక్కడే ఉంటున్నారు. రెండు మూడు రోజుల్లో కార్తీక పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఒకే నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున ముగ్గురు నాయకులు పాదయాత్రలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ముగ్గురు నాయకులు తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటుండటంతో సాధారణ కార్యకర్తలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అసలు ఏ నాయకుడి వెంట నడవాలో కూడా డిసైడ్ చేసుకోలేక పోతున్నారు. ఎవరికి వారే నాయకులు తలో దిక్కు పాదయాత్రలు చేస్తుంటే.. కార్యకర్తలు మాత్రం జుట్టు పీక్కుంటున్నారు.

తాము ఎవరి వెనుకైనా వెళితే.. తర్వాత వారికి టికెట్ రాకపోతే పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. ఒకే సెగ్మెంట్‌లో ఇలా ముగ్గురు పోటీ పడుతుంటే అధిష్టానం ఎందుకు చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు టికెట్ విషయాలు పక్కన పెట్టి.. ముగ్గురూ కలిసి యాత్ర చేస్తే కనీసం పార్టీకి కొత్త ఉత్సాహం అయినా వస్తుందని కార్యకర్తలు సూచిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల వల్లే పార్టీ తిరిగి పుంజుకోలేక పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దుబ్బాక విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

First Published:  12 Feb 2023 4:41 AM GMT
Next Story