Telugu Global
Telangana

గ్రేటర్ ఇష్యూ: వేలం.. గందరగోళం.. మళ్లీ వేలం!

మేడిపల్లి లాంటి ఏరియాలో అయితే గజానికి అధికంగా 50 వేల రూపాయల వరకూ రేటు వచ్చింది. కానీ.. మేడిపల్లిలో 50 నుంచి 60 ప్లాట్ల వరకు.. బాచుపల్లిలో 20 నుంచి 30 ప్లాట్ల వరకు భూములు కొనుగోలు చేసిన‌వారు ఆ తర్వాత డబ్బులు కట్టలేదని తెలుస్తోంది.

గ్రేటర్ ఇష్యూ: వేలం.. గందరగోళం.. మళ్లీ వేలం!
X

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూములకు ఇటీవల విపరీతమైన డిమాండ్ పలుకుతున్న విషయం అందరికీ తెలిసిందే. ధర రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇదంతా బాగానే ఉన్నా.. కొందరు చేస్తున్న పని మాత్రం అధికారులను ఇబ్బంది పెడుతోంది. ఒక సారి వేసిన వేలానికి.. మరోసారి కూడా అదే ప్రక్రియ నిర్వహించాల్సి వస్తోంది. ఆ గందరగోళం వెనకున్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

ఈ మధ్య.. బాచుపల్లితో పాటు పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని మేడిపల్లి ప్రాంతాల్లో హెచ్ఎండీఏ లే అవుట్లలో వేలం జరిగింది. ఎప్పటిలాగే డిమాండ్ కూడా బాగానే పలికింది. మేడిపల్లి లాంటి ఏరియాలో అయితే గజానికి అధికంగా 50 వేల రూపాయల వరకూ రేటు వచ్చింది. కానీ.. మేడిపల్లిలో 50 నుంచి 60 ప్లాట్ల వరకు.. బాచుపల్లిలో 20 నుంచి 30 ప్లాట్ల వరకు భూములు కొనుగోలు చేసిన‌వారు.. ఆ తర్వాత డబ్బులు కట్టలేదని తెలుస్తోంది.

కొందరైతే.. వేలంలో పాల్గొనేందుకు ధరావత్తు మొత్తంగా కట్టిన లక్ష రూపాయలను కూడా వదులుకుంటూ.. తాము కొన్న ప్లాట్లకు డబ్బులు కట్టకుండా వెనకడుగు వేస్తున్నారట. మరి కొందరేమో పూర్తిగా వైట్‌లో డబ్బులు చెల్లించాల్సి వస్తున్న కారణంగా అప్పటికప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారట. ఇంకొందరు తాము అనుకున్న సమయానికి బ్యాంకుల నుంచి రుణాలు రాకపోవడమో, డబ్బులు సమకూరకపోవడం వంటి కారణాలతో వెనకడుగు వేస్తున్నారట.

వాస్తవానికి.. ధరావత్తు మొత్తం కట్టి ఆక్షన్ లో పాల్గొని భూములు దక్కించుకున్నవాళ్లు.. తమకు ఆ భూమి దక్కినట్టుగా ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వారంలో రోజుల్లో 33 శాతం మొత్తాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నిబంధనలకు అనుగుణంగా నెల నుంచి 2 నెలలలోపు మిగతా మొత్తాన్ని చెల్లించాలి. ఈ మధ్య కాలంలో రకరకాల కారణాలతో నిర్ణయాలు మార్చుకుంటున్న కొందరు.. తమకు దక్కిన భూములకు డబ్బులు కట్టకుండా డిఫాల్టర్లుగా మారుతున్నారు. చివరికి తల పట్టుకుంటున్న అధికారులు.. ఆయా ప్లాట్లకు మళ్లీ వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

First Published:  16 Aug 2023 7:27 PM IST
Next Story