హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ న్యాయ నిపుణుల సదస్సు
100 దేశాలకు చెందిన జడ్జీలు, ఇండియా నుంచి మరో 100 మంది సీనియర్ న్యాయమూర్తులు ఈ సదస్సులో పాల్గొంటారు.
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానున్నది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ న్యాయ నిపుణుల సదస్సును నిర్వహించనున్నారు. 100 దేశాలకు చెందిన జడ్జిలు, ఇండియా నుంచి మరో 100 మంది సీనియర్ న్యాయమూర్తులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ మేరకు శనివారం జరిగిన మీడియా సమావేశంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జ్యూరిస్ట్ ప్రెసిడెంట్ ఆదిశ్. సి. అగర్వాల్ తెలిపారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ అసోసియేషన్లు, బార్ కౌన్సిళ్లకు చెందిన ప్రతినిధులు సెప్టెంబర్ 16, 17న జరుగనున్న న్యాయ నిపుణుల సదస్సుకు హాజరవయ్యే అవకాశం ఉన్నది. కాగా, అంతర్జాతీయ స్థాయిలో న్యాయ నిపుణుల మధ్య సోదర భావం పెంపొందించడం, ఒకరి నుంచి మరొకరు విలువైన సలహాలు, సూచనలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు.
వేర్వేరు దేశాలు, సంస్కృతుల నుంచి వచ్చిన న్యాయ నిపుణులు తమ ఆలోచనలు పంచుకోవడం, సూచనలు చేయడం వల్ల జ్యూరిస్ట్స్‌లకు మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయని వారు చెబుతున్నారు. 2004లో పాకిస్తాన్‌లోని లాహోర్ హైకోర్టులో డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. ఆయా కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసు వివరాలు, ప్రస్తుతం విచారిస్తున్న కేసు నెంబర్లను ఆ బోర్డుల్లో డిస్‌ప్లే చేసేవారు. ఈ విషయం ఒక సదస్సులో తెలుసుకున్న అనంతరం ఇండియా సహా చాలా దేశాల్లో అమలు చేస్తున్నారు. ఇది కక్షిదారులకు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటున్నాయి. ఇలాంటి కొత్త విషయాలు ఏ దేశంలోని కోర్టులో అమలు అవుతున్నా.. అంతర్జాతీయ సదస్సుల ద్వారా అందరికీ తెలుస్తాయని ఆదిశ్ సి. అగర్వాల్ అన్నారు.
ఇండియన్ జ్యుడీషియల్ సిస్టమ్‌లో ఉన్న అనేక మంచి విషయాలను ఇతర దేశాల ప్రతినిధులు తెలుసుకుంటారు. అలాగే వారి దగ్గర ఉన్న సరికొత్త అంశాలను మనం నేర్చుకోవడానికి వీలుంటుందని ఆయన చెప్పారు. జ్యుడీషియల్ సిస్టమ్‌లో ఉండే అనేక సమస్యలకు ఇంటర్నెట్‌లో సమాధానాలు ఉండవు. కానీ ఇలాంటి సదస్సులు నిర్వహించడం వల్ల చాలా విషయాలకు పరిష్కారాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.
ఇక దేశంలో న్యాయవాదులపై పెరుగుతున్న దాడులపై కూడా ఈ సదస్సులో చర్చ జరుగనున్నదని తెలిపారు. కర్ణాటకలో ఇప్పటికే అడ్వొకేట్ల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే అలాంటి చట్టాన్ని చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించేలా ప్రయత్నిస్తానని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు.