మున్నేరుకి కాంక్రీట్ వాల్స్.. త్వరలో కేటీఆర్ శంకుస్థాపన
మొత్తంగా మున్నేరు వరద నివారణతోపాటు సుందరీకరణ పనులకోసం రాష్ట్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరులో చొరవ చూపించిన మంత్రి కేటీఆర్ కి మంత్రి పువ్వాడ అజయ్ ధన్యవాదాలు తెలిపారు.
భారీ వర్షాలకు మున్నేరు నదికి వరదనీరు వస్తే ఖమ్మం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సగం ఖమ్మం మున్నేరు ప్రభావానికి లోనయింది. గతంలో ఎన్నడూ లేనంతగా 30.7 అడుగుల మేర మున్నేరు ఉధృతంగా ప్రవహించింది. దాదాపు 2300 ఇళ్లు నీటమునిగాయి. కృష్ణానదిలో కలిసే మున్నేరు ఖమ్మంపై అప్పుడప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆ ఇబ్బందుల నుంచి ప్రజలను కాపాడేందుకు మున్నేరుకి ఇరువైపులా కాంక్రీట్ వాల్స్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్ట వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని 33 అడుగుల మేర కాంక్రీట్ వాల్స్ నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి రూ.690.52కోట్లు మంజూరు చేస్తూ జీఓ జారీ అయింది. త్వరలో ఈ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు.
ఖమ్మం సిటీని ఆనుకొని ప్రవహిస్తున్న మున్నేరు నదికి భారీ వర్షాలు వస్తే సమీప కాలనీలను ముంచెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందన్నారు మంత్రి పువ్వాడ అజయ్. గతంలో మున్నేరుకు ఇరువైపులా కరకట్టలు నిర్మించాలని నిర్ణయించగా, భూసేకరణ సమస్యగా మారుతుందని కాంక్రీట్వాల్స్ కు ఓకే చెప్పామన్నారు. పోలేపల్లి నుంచి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వరకు రెండు వైపులా మొత్తం 8 కిలోమీటర్ల మేర కాంక్రీట్ వాల్స్ నిర్మిస్తామని చెప్పారు. వీటి నిర్మాణాలు పూర్తయితే వరద ఉధృతి ఉన్నా కూడా మున్నేరు సమీప కాలనీలకు ముంపు సమస్య ఉండదని అన్నారు మంత్రి.
చెక్ డ్యామ్ లు..
కాంక్రీట్ వాల్స్నిర్మించే చోట ఇప్పటికే రెండు చెక్ డ్యామ్ లు ఉన్నాయి. మరో మూడు చోట్ల రూ.30 కోట్లతో చెక్ డ్యామ్ లు నిర్మించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇక తీగల వంతెనకి కూడా టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. దీనికోసం రూ.180కోట్లు మంజూరయ్యాయి. మొత్తంగా మున్నేరు వరద నివారణతోపాటు సుందరీకరణ పనులకోసం రాష్ట్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరులో చొరవ చూపించిన మంత్రి కేటీఆర్ కి మంత్రి పువ్వాడ అజయ్ ధన్యవాదాలు తెలిపారు. వీలైనంత త్వరగా కేటీఆర్ చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభిస్తామన్నారు.