అనుకున్నదొక్కటి.. అవుతుందొక్కటి.. బీజేపీలో చేరిన నాయకుల్లో ఆందోళన?
తెలంగాణ బీజేపీలో పాత, కొత్త నాయకుల మధ్య వర్గ విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి.
కేంద్రంలోనీ బీజేపీ బలం, రాష్ట్రంలో నాయకుల దూకుడు చూసి చాలా మంది ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. తెలంగాణలో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంచనాలతో కాషాయ కండువాలు కప్పుకున్నారు. బీజేపీలో తమకు తగిన ప్రాధాన్యత ఇస్తారని, అధికారంలోకి వస్తే మంచి పదవులు కూడా దక్కించుకోవచ్చని కలలు కన్నారు. అధికారం సంగతి అటుంచితే.. అసలు డిపాజిట్లు అయినా దక్కుతాయా అనే భయం ఇప్పుడు కొత్తగా చేరిన నాయకుల్లో మొదలైంది.
తెలంగాణ బీజేపీలో పాత, కొత్త నాయకుల మధ్య వర్గ విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి. నిన్నటి వరకు బండి సంజయ్‌ను తప్పించి కొత్తగా చేరిన ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి ఇస్తారని చాలా మంది భావించారు. బీజేపీలో బండి, ఈటల వర్గంగా పార్టీ నాయకులు చీలిపోయారు. నాలుగు రోజుల పాటు ఈటల ఢిల్లీ, అస్సాం, ముంబై అంటూ తిరిగి.. పలువురు నాయకులను కలిసి వచ్చారు. కానీ ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈటల వర్గం నాయకులు నిరాశలో కూరుకొని పోయినట్లు తెలుస్తున్నది.
తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని చాలా మంది నాయకులు భావించి ఆ పార్టీలో చేరారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వారి అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక సమావేశంలో మాట్లాడుతూ.. తమకు పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు కూడా లేరని అన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీలో అంతర్గతంగా తీవ్ర చర్చకు దారి తీసింది. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి సానుకూల వాతావరణం ఏమీ లేదని నాయకులు గ్రహిస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు బీజేపీలో చేరతారని భావించిన పొంగులేటీ, జూపల్లి కూడా తమ నిర్ణయం మార్చుకున్నారు. మరి కొంత మంది నాయకులు కూడా ఇప్పుడు బీజేపీలో చేరడంపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా బలం లేదని.. ఆ పార్టీలోకి పోయిన వారే ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు తాము మాత్రం వెళ్లి చేసేదేముంటుందని సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణ బీజేపీలో ఉన్న వర్గ విభేదాలపై హై కమాండ్ ఘాటుగానే స్పందించింది. పాత నాయకులకే తమ ప్రాధాన్యత ఉంటుందని కూడా సంకేతాలు ఇచ్చింది. దీంతో కొత్తగా పార్టీలో చేరిన వారు.. తాము ఒకటి తలిస్తే.. ఇక్కడ మరో రకంగా జరుగుతుందని బాధపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా బలం లేదని.. ఇప్పుడు తమ భవిష్యత్ ఏంటని ఆందోళన కూడా చెందుతున్నారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కొంత మంది సీనియర్ నాయకులు తిరగి పాత పార్టీలోకే వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తున్నది. అయితే, పార్టీ మారితే తమపై హైకమాండ్ కక్ష సాధింపు చర్యలకు తెర తీస్తుందేమో అనే భయం కూడా వారిని వెంటాడుతున్నది. తమ వ్యాపారాలపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తే.. మొదటికే మోసం వస్తుందని కూడా ఆందోళన చెందుతున్నారు. కొంత కాలం వేచి చూసి.. ఎన్నికలకు ముందు వేరే పార్టీలోకి వెళ్లిపోదామని కూడా కొందరు సీనియర్లు నిర్ణయించుకున్నారు. మొత్తానికి కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ బీజేపీపై గట్టిగానే చూపిస్తున్నది.