Telugu Global
Telangana

రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే

దాదాపు 75 ప్రశ్నలు.. నెలాఖరు వరకు సర్వే పూర్తి చేయాలనుకుంటున్న ప్రభుత్వం

రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే
X

రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే రేపటి నుంచి ప్రారంభం కానున్నది. మొత్తం 75 ప్రశ్నలతో సుమారు 28 రోజుల పాటు ఈ సర్వే చేయనున్నారు. సర్వేకు వెళ్లే గణకులు ఇంటింటికీ వెళ్లి 56 ప్రధాన ప్రశ్నలు అడగనున్నారు. కొన్నింటికి అనుబంధ ప్రశ్నలు వేసి సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు నమోదు చేస్తారు. సర్వేలో కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్‌ నంబర్‌, పని నమోదు చేయనున్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న కుటుంబసభ్యుల వివరాలూ నమోదు చేస్తారు. ఏ కారణంతో వలస వెళ్లారనే సమగ్ర సమాచారం సేకరించేలా ప్రశ్నలు రూపొందించారు. ప్రజలు తీసుకున్న రుణాలపై ప్రత్యేకంగా మూడు ప్రశ్నలు వేయనున్నారు. కుటుంబ సభ్యులందరి స్థిర, చరాస్తుల వివరాలు సేకరించనున్నారు. ఈ సర్వేకు నోడల్‌ విభాగంగా ప్రణాళికశాఖ వ్యవహరించనున్నది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగేఈ సర్వే జరుగుతుంది. జిల్లా, మండల నోడల్‌ అధికారులు.. ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లను గుర్తించనున్నారు. ఈ కుటుంబ సర్వేలో సుమారు 80 వేల మంది పాల్గొనున్నారు. సర్వే పూర్తయిన ఇంటిగోడపై స్టిక్కర్‌ అతికించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.

First Published:  5 Nov 2024 8:58 AM IST
Next Story