Telugu Global
Telangana

తెలంగాణలో మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే!

దరఖాస్తులు తీసుకునే సమయంలోనే ప్రతీ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం సేకరించబోతోందని సమాచారం. అంటే అచ్చం కేసీఆర్ హయంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే మాదిరిగానే ఈ సర్వే ఉండబోతోందని తెలుస్తోంది.

తెలంగాణలో మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే!
X

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలతో పాలన సాగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్కు పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్‌గా మార్చి.. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అయితే జిల్లాల నుంచి వందలాది మంది జనం హైదరాబాద్ ప్రజాభవన్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు తీసుకున్న మరో కీలక నిర్ణయం ప్రజాపాలన. అంటే జిల్లాలోని ఉన్నతాధికారులందర్నీ గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి, వాళ్ల సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం.

ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. సమస్యల పరిష్కారంతో పాటు 6 గ్యారంటీల అమలు కోసం జనం నుంచి దరఖాస్తుల్ని తీసుకోవడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దరఖాస్తులు తీసుకునే సమయంలోనే ప్రతీ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం సేకరించబోతోందని సమాచారం. అంటే అచ్చం కేసీఆర్ హయంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే మాదిరిగానే ఈ సర్వే ఉండబోతోందని తెలుస్తోంది. ప్రతి కుటుంబానికి చెందిన భూములు, ఇళ్లు, ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం, వాహనాలు, గ్యాస్ కనెక్షన్లు, రేషన్‌ కార్డు వివరాలను అధికారులు సేకరించబోతున్నారని సమాచారం.

గతంలో మాజీ సీఎం కేసీఆర్ హయంలోనూ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. 2014 ఆగస్టు 19న ఒకే రోజులో ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఉద్యోగం, వ్యాపారం, ఆదాయాలకు సంబంధించి ప్రతీ కుటుంబంలోని పూర్తి సమాచారం సేకరించింది. కానీ, సర్వే రిపోర్టు ఎక్కడా బయట పెట్టలేదు. సామాజిక వర్గాల వారీగా ఓటర్ల సమాచారం సేకరించి.. కులాల వారీగా పథాకాలు అమలు చేయడానికి మాత్రమే ఆ సర్వే ఉపయోగపడిందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు మరోసారి సర్వే చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

First Published:  25 Dec 2023 3:30 PM IST
Next Story