Telugu Global
Telangana

జలాశయాల వద్ద పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయండి.. సీఎం కేసీఆర్ ఆదేశాలు

నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాల వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.

జలాశయాల వద్ద పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయండి.. సీఎం కేసీఆర్ ఆదేశాలు
X

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో తాగునీటి పనులకు సుప్రీంకోర్టు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూలై వరకు కరివెన జలాశయానికి నీటిని తరలించాలని, ఆగస్ట్ వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాల వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై కూడా సమీక్ష చేపట్టారు. ఇక్కడ ఉన్న చిన్న చిన్న పెండింగ్ పనులు జూన్ లోగా పూర్తి చేయాలని కేసీఆర్ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇళ్ల క్రమబద్దీకరణకు మరో నెల రోజుల గడువు..

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ రెండు నగరాల పరిధిలో ఉన్నమున్సిపాలిటీల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా నిబంధనల మేరకు స్థలాలను క్రమబద్దీకరించి, వారికి హక్కులు కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు నోటరీ స్థలాలు జీవో 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ చేసుకునేందుకు మరో నెల రోజుల పాటు గడువు పొడిగిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

నూతన సచివాలయంలో జంట నగరాలకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను సోమవారం కలిసి జీవో 58,59 గడువును పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాగా, సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి.. నెల రోజుల పాటు గడువును పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి.. ప్రజలు తమ ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ సమస్యలను తెలియజేయాలని సూచించారు.

ప్రజా ప్రతినిధులు అన్ని సమస్యలను క్రోఢీకరించి, వారికి న్యాయమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం నుంచి అందించే బాధ్యతను తీసుకుంటారని చెప్పారు. ఏక కాలంలో పేదల ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అదే సమయంలో వ్యవసాయ భూముల నోటరీ సమస్యలు కూడా పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నామని సీఎం చెప్పారు.



First Published:  1 May 2023 2:18 PM GMT
Next Story