Telugu Global
Telangana

అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు నెలాఖరు లోగా పూర్తి చేయండి : మంత్రి హరీశ్ రావు

డీఎంఈ, డీపీహెచ్, టీవీవీపీ పరిధిలోని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకుంటున్న రోగుల సంఖ్య పెరగడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు నెలాఖరు లోగా పూర్తి చేయండి : మంత్రి హరీశ్ రావు
X

బోధనాసుపత్రుల పరిధిలో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఈ నెలాఖరు లోగా భర్తీ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఇప్పటికే వెరిఫికేషన్‌తో పాటు ఇతర ప్రక్రియలు కూడా పూర్తయ్యాయని.. తుది ఫలితాలు ప్రకటించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు, పురోగతిపై మంత్రి హరీశ్ రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఈ, డీపీహెచ్, టీవీవీపీ పరిధిలోని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకుంటున్న రోగుల సంఖ్య పెరగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

డీఎంఈ పరిధిలో 72,225 నుంచి 1,08,223కు పెరగగా.. టీవీవీపీలో 66,153 నుంచి 99,744కు పెరిగాయని చెప్పారు. డీపీహెచ్ పరిధిలో కొత్తగా ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించామని.. ఇప్పటికే అక్కడ 14,965 కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు. రోగుల సంఖ్య పెరగడానికి కృషి చేసిన వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయని.. అంతే కాకుండా అసుపత్రుల్లో కూడా సౌకర్యలు పెంచినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని మంత్రి చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించడం వల్లే ఈ గణనీయమైన మార్పు సాధ్యమైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలోని వెల్‌నెస్ సెంటర్ల పని తీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని అన్నారు.

First Published:  22 March 2023 1:14 PM IST
Next Story