షర్మిలపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
తెలంగాణ పాలకులను టెర్రరిస్టులని, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడిన షర్మిలపై కఠిన చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు సతీష్ రెడ్డి.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు టీఎస్ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి. ఆమె విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పాలకులను టెర్రరిస్టులని, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడిన షర్మిలపై కఠిన చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు సతీష్ రెడ్డి.
ఉద్యమకారుల్ని అవమానిస్తారా..?
తెలంగాణను, తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులను ఉగ్రవాదులతో పోల్చి షర్మిల అవమానించారని మండిపడ్డారు సతీష్ రెడ్డి. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా శాంతియుతంగా సాగిన ఉద్యమాన్ని షర్మిల ఉగ్రవాదంతో పోల్చడం ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. వైఎస్ కుటుంబం తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని షర్మిలకు సూచించారు.
గవర్నర్ అపాయింట్ మెంట్ ఎలా ఇస్తారు..?
షర్మిల ఆందోళన, అరెస్ట్ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆమెకు సపోర్ట్ ఇవ్వడాన్ని టీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతోంది. తాము వదిలిన "బాణం" తానా అంటే తందానా అంటున్న "తామర పువ్వులు" అంటూ కవిత వేసిన ట్వీట్ బాగా వైరల్ అయింది. షర్మిలకు బీజేపీ లోపాయికారీగా మద్దతిస్తోందన్న విషయం రుజువైందని అన్నారామె. తాజాగా సతీష్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణను ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తో పోల్చిన షర్మిలకు గవర్నర్ తమిళిసై అపాయింట్ మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆమెపై గవర్నర్ ఎందుకు సానుభూతి చూపిస్తున్నారని నిలదీశారు. తమిళిసై తెంగాణకు గవర్నరా లేదా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కా అనేది చెప్పాలన్నారు సతీష్ రెడ్డి. గవర్నర్ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా..? లేకపోతే బీజేపీకి అనుకూలంగా, అనుబంధంగా పనిచేస్తున్న ఇతర పార్టీల కోసం పనిచేస్తున్నారో సమాధానమివ్వాలన్నారు.