Telugu Global
Telangana

మునుగోడులో ఎవరిమధ్య పోటీ ? తేల్చేసిన కేటీఆర్

మునుగోడు ఉపఎన్నికలో పోటీ ఎవరి మధ్య అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఏళ్ళకేళ్ళు పరిపాలించి ప్రజలను ఫ్లోరోసిస్ కు బలి చేసిన కాంగ్రెస్, ఫ్లోరోసిస్ నిర్మూలనకు కనీసం సహకరించని కేంద్ర‍ంలో ఉన్న బీజేపీ, ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాప విముక్తి చేసిన తెరాస... పోటీ ఎవరి మధ్య అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

మునుగోడులో ఎవరిమధ్య పోటీ ? తేల్చేసిన కేటీఆర్
X

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. మరో వైపు గెలుపు కోసం టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. సభలు, సమావేశాలతో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి పార్టీలు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో నల్గొండజిల్లాలో ప్రజల జీవితాలను ఆగం చేసిన ఫ్లోరోసిస్ భూతం గురించి ట్వీట్ లో పేర్కొన్నారు కేటీఆర్. ఏళ్ళకేళ్ళు పరిపాలించి ప్రజలను ఫ్లోరోసిస్ కు బలి చేసిన కాంగ్రెస్, ఫ్లోరోసిస్ నిర్మూలనకు కనీసం సహకరించని కేంద్ర‍ంలో ఉన్న బీజేపీని విమర్శించిన కేటీఆర్ మునుగోడులో పోటీ ఎవరి మధ్య అంటూ ట్వీట్ చేశారు.

''మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ?

ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్

ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ

ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన తెరాస'' అని ఓ ట్వీట్ చేశారు కేటీఆర్.

ఆ తర్వాత మరో ట్వీట్ లో వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో , కాళ్ళు , చేతులూ వంకర్లు తిరిగిన ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి అనే బాలుడిని టేబుల్ మీద పడుకోబెట్టి దుశ్చర్ల సత్యనారాయణ అనే సామాజిక కార్యకర్త ఫ్లోరోసిస్ బాధల గురించి వాజ్ పేయ్ కి వివరిస్తున్న ఫోటో షేర్ చేశారు కేటీఆర్. ఆ ఫోటోలో వాజ్ పేయ్ పక్కన అప్పటి కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా ఉన్నారు.

ఆ ట్వీట్ లో కేటీఆర్,

''ప్రధాని టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్ష్యం

దశాబ్దాలు అధికారంలో ఉన్నా స్వయంగా ప్రధానికి మొరపెట్టుకున్నా పైసా ఇవ్వలేదు, పరిష్కారం కాలేదు

తెరాస ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన శాశ్వతంగా ఈ సమస్య తీర్చిన మాట వాస్తవమని కేంద్రమే పార్లమెంట్లో చెప్పింది'' అని పేర్కొన్నారు.

కేటీఆర్ ట్వీట్ పై నెటిజనుల స్పందన పెద్ద ఎత్తున ఉంది.

''ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా తెలంగాణ

పార్లమెంట్‌లో కేంద్రప్రభుత్వం ప్రకటన

- తెలంగాణ ఆవిర్భావం నాటికి 967 గ్రామాల్లో ఫ్లోరైడ్ రక్కసి

- 2020లో సున్నాకు చేరిన సంఖ్య

-సీఎం కేసీఆర్ కలల పథకం మిషన్ భగీరథ అమలుతో అద్భుత ఫలితం'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా

''నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకుల పాలనలో గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడుస్తూ గోస పడినం, ఫ్లోరోసిస్ తో ఇబ్బంది పడినం

నేడు స్వరాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో మిషన్ భగీరథ ద్వారా ఇంటి ముందుకే స్వచ్ఛమైన మంచినీళ్లు

ఇది బీజేపీ, కాంగ్రెస్ పాలనకు మరియు TRS పాలనకు మధ్య ఉన్న తేడా '' అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.


First Published:  3 Oct 2022 3:25 PM GMT
Next Story