ముగ్గురు బీజేపీ నేతల మధ్య చిచ్చుపెట్టిన మునుగోడు ఇంచార్జి పదవి..!
2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉపఎన్నిక ఇంచార్జిగా వ్యవహరిస్తే తమ రాజకీయ భవిష్యత్‌కు కలసి వస్తుందని పలువురు బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఇప్పుడు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు మునుగోడుపై దృష్టిపెట్టాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక రాబోతుండటంతో మునుగోడు కేంద్రంగా రాజకీయం చేస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున ఉప ఎన్నిక బరిలోకి దిగనున్నారు. అధికార టీఆర్ఎస్‌కు చెక్ పెడుతూ దక్షిణ తెలంగాణలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకున్నది. ఇప్పటికే అక్కడ పలువురు సీనియర్ నేతలను రంగంలోకి దింపింది. అయితే మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన ఇంచార్జి పదవి కోసం ముగ్గురు బీజేపీ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తున్నది.
2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉపఎన్నిక ఇంచార్జిగా వ్యవహరిస్తే తమ రాజకీయ భవిష్యత్‌కు కలసి వస్తుందని పలువురు బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ అంటే బండి సంజయ్ అనే భావనలోనే ప్రజలు ఉన్నారు. చాన్నాళ్లుగా పార్టీలో కొనసాగుతున్నా సరైన గుర్తింపు రావడం లేదు. వేరే పార్టీలో కీలకమైన పదవుల్లో ఉండి.. ఇప్పుడు బీజేపీలోకి వచ్చినా.. తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే భావనలో కూడా కొంత మంది నేతలు ఉన్నారు. ఈ క్రమంలో మునుగోడు ఎన్నిక ఇంచార్జి పదవి తనకు ఇవ్వాలని వారు అధిష్టానాన్ని కోరుతున్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మనోహర్ రెడ్డి ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. తమకే ఈ పదవి ఇవ్వాలని ఇప్పటికే కోరినట్లు తెలుస్తున్నది. మునుగోడు మండలం పలివెల గ్రామం ఈటల రాజేందర్ అత్తగారి ఊరు. ఇప్పటికే ఆ ఊరు కేంద్రంగా మునుగోడులో పార్టీని సమన్వయం చేస్తున్నారు. అక్కడే తాత్కాలికంగా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని పలువురు ఇతర పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇటీవల చౌటుప్పల్ ఎంపీపీతో పాటు పలువురు సర్పంచ్‌లను పార్టీలోకి తీసుకొని రావడంలో ఈటల విజయవంతం అయ్యారు. తనకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తే మరింత మందిని తీసుకొని వస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతానికి జాయినింగ్స్ కమిటీ బాధ్యుడిగా ఉన్న ఈటల.. ఎన్నికల ఇంచార్జి పదవిని కూడా ఆశిస్తున్నారు.
మరోవైపు సీనియర్ నేత వివేక వెంకటస్వామి కూడా ఇంచార్జి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తనకు కాంగ్రెస్ నేతలతో పరిచయాలు ఉన్నాయని.. మునుగోడు ఇంచార్జి పదవి ఇస్తే తప్పకుండా మరింత సమర్థవంతంగా పని చేస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తున్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా సన్నిహితుడైన వివేక్.. కాంగ్రెస్ నాయకులను ప్రసన్నం చేసుకోవడంలో ముందుంటాను కాబట్టి తనకే ఆ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక మనోహర్ రెడ్డి తనదైన మార్గాల్లో పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురు నాయకులు ఇంచార్జి పదవి కోసం పోటీ పడుతుండటం పార్టీకి కూడా ఇబ్బందిగా మారింది.
ఇంచార్జిగా ఉండి పార్టీని గెలిపిస్తే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ వర్గం వారికి మరిన్ని సీట్లు ఇప్పించుకోవచ్చనే ఆలోచనతోనే ఆ పదవి కోసం పోటీ పడుతున్నట్లు చర్చ జరుగుతున్నది. అయితే దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ఇంచార్జిగా జితేందర్ రెడ్డి పని చేశారు. ఆయన అయితే సెంటిమెంట్ పరంగా కూడా కలసి వస్తుందని పలువురు పార్టీ నాయకులు సూచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒక పదవి కోసం ముగ్గురు పోటీ పడుతుండటంతో.. వాళ్ల బదులు పాత వ్యక్తినే నియమిస్తే ఎలాంటి గొడవ ఉండదని అంటున్నారు. ఈ గొడవ కారణంగానే మునుగోడు నియోజకవర్గానికి ఇంకా ఇంచార్జిని నియమించలేదని.. అమిత్ షా పర్యటనలో ఆయన సూచించే వ్యక్తికి బాధ్యతలు అప్పగించే వీలున్నట్లు తెలుస్తున్నది. అందుకే ముందుగా మండలాల వారీగా బాధ్యులను నియమించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.