Telugu Global
Telangana

ఖమ్మం ఎంపీ సీటు.. రేసులో ఆ నలుగురు..!

గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన రేణుకా చౌదరితో పాటు జిల్లా నుంచి ప్రస్తుత కేబినెట్‌లో మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారి కుటుంబసభ్యులు ఖమ్మం ఎంపీ సీటుపై కన్నేశారు.

ఖమ్మం ఎంపీ సీటు.. రేసులో ఆ నలుగురు..!
X

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్‌ ఎవరిని నిలబెట్టబోతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానం మినహా అన్ని స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. దీంతో ఇప్పుడు ఆ పార్లమెంట్ సీటు కోసం పార్టీలో తీవ్ర పోటీ ఏర్పడింది.

గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన రేణుకా చౌదరితో పాటు జిల్లా నుంచి ప్రస్తుత కేబినెట్‌లో మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారి కుటుంబసభ్యులు ఖమ్మం ఎంపీ సీటుపై కన్నేశారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంపీగా పోటీ చేయాలని ఉందని చెప్పారు. తను పోటీ చేయాలనుకుంటే కాదనేవారు లేరంటూ కామెంట్స్ చేశారు.

ఇక మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తనయుడు యుగేందర్ సైతం ఎంపీ టికెట్‌ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి విజయం కోసం విశేషంగా కృషిచేశారు యుగేందర్. ఖమ్మం నియోజకవర్గంలో పాత, కొత్త కార్యకర్తల మధ్య సమన్వయం కుదర్చడంలో ఆయనదే కీలక పాత్ర. ఇక మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు.. పొంగులేటి ప్రసాద్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని సమాచారం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పొంగులేటి ఎంపీగా విజయం సాధించారు.

మరోవైపు సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపితే ఖమ్మం నుంచి పోటీ చేయించాలనేది రేవంత్ ప్లాన్‌గా తెలుస్తోంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు స్థానాలు కాంగ్రెస్ భారీ మెజార్టీలతో గెలవడంతో ఈ సీటును అత్యంత సురక్షితంగా భావిస్తున్నారు రేవంత్. పార్లమెంట్ పరిధిలో తుమ్మల, భట్టి, పొంగులేటి బలమైన నేతలు ఉండడం కూడా కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. ఇదే అంశాన్ని AICC దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

First Published:  11 Jan 2024 11:50 AM IST
Next Story