సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అమరవీరుల స్మారకం : మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఈ నెల 22న దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున లుంబిని పార్క్ సమీపంలో నిర్మిస్తున్న అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా.. హైదరాబాద్ నడిబొడ్డున అమరవీరుల స్మారక చిహ్నం రూపొందుతోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ నెల 22న దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున లుంబిని పార్క్ సమీపంలో నిర్మిస్తున్న అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో స్మారక చిహ్నానికి సంబంధించి నిర్మాణ పనులను శనివారం మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంతమంతా కలియ తిరిగి పెండింగ్ పనుల విషయమై అధికారులను ఆరా తీశారు.
అమరుల స్మారకం ప్రధాన ద్వారం, ఫౌంటైన్, ల్యాండ్ స్కేప్ ఏరియా, గ్రీనరీ, పార్కింగ్ ఏరియాతో పాటు నిర్మాణ లోపలి భాగంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ, ఆడియో విజువల్ రూమ్, ఎస్కలేటర్, లిఫ్ట్‌లను మంత్రి పరిశీలించారు. కన్వెన్షన్ సెంటర్ పైన ఏర్పాటు చేస్తున్న రెస్టారెంట్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పెండింగ్ పనులు, ఫినిషింగ్ వర్క్స్‌ను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అమరుల త్యాగాలు ప్రతిబింభించేలా నిరంతరం జ్వలించే జ్వాలా ఆకృతి దీపం వద్ద లైటింగ్ పనులను పరిశీలించారు. ఈ అమరుల స్మారక చిహ్నం తెలంగాణ ప్రజల మది నిండా నిలిచే నిర్మాణమని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంత్రి వెంట ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, సీఈ మోహన్ నాయక్, ఎస్ఈలు హఫీజ్, లింగారెడ్డి, ఏఈ ధీరజ్ రెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
కేసిఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా
— Vemula Prashanth Reddy (@VPR_BRS) June 10, 2023
అమరవీరుల స్మారక చిహ్నం తుది దశ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల pic.twitter.com/677SVH7HHs