Telugu Global
Telangana

కోడ్ లాంగ్వేజ్ కొబ్బరినీళ్లు.. ఫామ్ హౌస్ ఘటనలో పక్కా ఆధారాలు..

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామన్న సంభాషణ వాయిస్ రికార్డర్లలో స్పష్టంగా రికార్డ్ అయింది. కర్నాటక, ఢిల్లీ.. ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే జరిగిందని రామచంద్రభారతి చెప్పిన మాటలు కూడా రికార్డ్ అయ్యాయి.

కోడ్ లాంగ్వేజ్ కొబ్బరినీళ్లు.. ఫామ్ హౌస్ ఘటనలో పక్కా ఆధారాలు..
X

"డబ్బులు దొరకలేదు కదా, ఆధారాలుంటే చూపండి, ఆ ముగ్గురితో మాకు సంబంధం లేదు, ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తాం.." రెండురోజులుగా ఇలాంటి స్టేట్ మెంట్ లతో రెచ్చిపోయారు బీజేపీ నేతలు. వారి నోటికి గట్టిగానే తాళం వేశారు పోలీసులు. పక్కా ఆధారాలతో రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు. ఎమ్మెల్యేల బేరసారాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ చార్జ్ సునీల్ కుమార్ బన్సల్ హస్తం ఉన్నట్టు కూడా పక్కా ఆధారాలు సేకరించారు. రిమాండ్ రిపోర్ట్ లో ఈ కీలక అంశాలన్నీ వివరంగా ఉన్నాయి.

కోడ్: కొబ్బరినీళ్లు..

పైలట్ రోహిత్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, పోలీసులు అందరూ కలసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఫామ్ హౌస్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు, స్పై కెమెరాలు వాడారు, మీడియేటర్లతో మాట్లాడేటప్పుడు వాయిస్ రికార్డర్లు దుస్తుల్లో ఉంచుకున్నారు. పక్కాగా ఆధారాలన్నీ దొరికిన తర్వాత ఫైనల్ గా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి "కొబ్బరినీళ్లు తీసుకురా" అని ఫామ్ హౌస్ సిబ్బందికి చెప్పాడు. ఇదే ఇక్కడ కోడ్ లాంగ్వేజ్ అన్నమాట. కొబ్బరినీళ్లు అనే సిగ్నల్ రాగానే పోలీసులు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిని చూసి రామచంద్ర భారతి, నందు కుమార్, సింహయాజి.. ముగ్గురూ షాకయ్యారు. నలుగురు ఎమ్మెల్యేలు తమ పని పూర్తి కావడంతో పోలీసులకు ఆ పరికరాలన్నీ అప్పగించి బయటకు వచ్చేశారు.

ఎక్కడెక్కడ ఏమేం వాడారంటే..?

ఫామ్ హౌస్ లో డీల్ జరిగే ప్రదేశంలో నాలుగు రహస్య కెమెరాలు పెట్టారు. రెండు వాయిస్ రికార్డర్లు ఉన్నాయి. వాయిస్ రికార్డర్లు రోహిత్ రెడ్డి కుర్తా జేబుల్లో పెట్టారు పోలీసులు. ఎవరికీ అనుమానం రాలేదు అనుకున్న తర్వాతే మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత ఆ ముగ్గురు మీడియేటర్లు డీల్ విషయంలో రెచ్చిపోయారు. కథంతా చెప్పేశారు, ఆఫర్లు వినిపించారు. చివరకు పక్కా ఆధారాలతో పోలీసులకు చిక్కారు.

మినిట్ టు మినిట్ ఏం జరిగిందంటే..?

- ఫామ్ హౌస్ లో మధ్యాహ్నం 3.05 గంటలకు రహస్య కెమెరాలు ఆన్ చేశారు.

- 3.10 గంటలకు ముగ్గురు నిందితులతో కలిసి ఫామ్ హౌస్ హాల్ లోకి రోహిత్ రెడ్డి వచ్చారు

- సరిగ్గా గంట తర్వాత అంటే 4.10 గంటలకు ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతారావు వచ్చారు

- మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారు

- మీటింగ్ పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు అంటూ రోహిత్ రెడ్డి సిగ్నల్ ఇచ్చాడు

- ఆ వెంటనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

దొరికిన ఆధారాలు..

రహస్య కెమెరాల్లో నిందితుల కదలికలన్నీ స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. సో... మేం పూజలకోసం వచ్చాం, పూలు చల్లాం అంటూ బుకాయించడం కుదరదన్నమాట. ఇక వాయిస్ రికార్డర్లతో మిగతా సగం పని పూర్తయింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామన్న సంభాషణ వాయిస్ రికార్డర్లలో స్పష్టంగా రికార్డ్ అయింది. కర్నాటక, ఢిల్లీ.. ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే జరిగిందని రామచంద్రభారతి చెప్పిన మాటలు కూడా రికార్డ్ అయ్యాయి. తుషార్ కు రామచంద్రభారతి ఫోన్ చేయడం కూడా రికార్డ్ అయింది.

విజువల్ ఎవిడెన్స్..

తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలని రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జ్ సునీల్ కుమార్ బన్సల్ కు రామచంద్రభారతి పంపిన ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ తీశారు పోలీసులు. రామచంద్ర భారతి, నందు వాట్సప్ చాటింగ్ ఆంతా స్క్రీన్ షాట్ల రూపంలో సేకరించారు. 25 మంది చేరేందుకు రెడీగా ఉన్నారంటూ "సంతోష్ బీజేపీ" పేరుతో ఉన్న నెంబర్ కు రామచంద్ర భారతి పంపిన వాట్సప్ మెసేజ్ సేకరించారు. నందు డైరీలో పలు కీలక అంశాలు దొరికాయి. ఆయన డైరీలో 50 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరాలు పోలీసులు సంపాదించారు.

ఇలా పక్కా ఆధారాలతో ఆ ముగ్గురు బుక్కయ్యారు. వారి వెనక ఎవరెవరున్నారనే విషయం కూడా స్పష్టంగా రికార్డ్ అయింది. ఫామ్ హౌస్ వ్యవహారం బయటపడ్డాక ఇదంతా కుట్ర అంటూ రెచ్చిపోతున్న బీజేపీ నేతలు ఇక సైలెంట్ గా ఉండాల్సిందే.

First Published:  29 Oct 2022 7:13 AM IST
Next Story