Telugu Global
Telangana

హైదరాబాద్‌లో పెరుగుతున్న 'కో లివింగ్' కేంద్రాలు..

హాస్టల్స్, పేయింగ్ గెస్ట్ (PG)లకు తర్వాతి రూపమే ఈ కో లివింగ్ కేంద్రాలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 20 కో లివింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో కో లివింగ్ సెంటర్లో దాదాపు 300 మంది నివ‌శించే అవకాశముంటుంది.

Coliving in Hyderabad
X

వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి మారిపోతున్నారు. ఈ క్రమంలో బదిలీలు, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారు, ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇతర పట్టణాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. వీరందరిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కో లివింగ్ కేంద్రాలు పెరుగుతున్నాయి.

హాస్టల్స్, పేయింగ్ గెస్ట్ (PG)లకు తర్వాతి రూపమే ఈ కో లివింగ్ కేంద్రాలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 20 కో లివింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో కో లివింగ్ సెంటర్లో దాదాపు 300 మంది నివశించే అవకాశముంటుంది.

గతంలో కో లివింగ్ కేంద్రాలకు బెంగళూరులో ఎక్కువ డిమాండ్ ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధితో ఇక్కడ కూడా కో లివింగ్ బిజినెస్ బాగా పెరిగింది. హాస్టల్స్ లాగా ఒకే రూమ్‌కి పరిమితం అవడం, లేదా PG కేంద్రాల్లోలాగా నిబంధనలు మరీ కఠినంగా ఉండకపోవడం కో లివింగ్ ప్రత్యేకత. రద్దీ ప్రాంతాల్లో సింగిల్ బెడ్ రూమ్ అద్దెకు తీసుకోవాలంటే కనీసం 25 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ కో లివింగ్‌లో రూ.9 వేల ఖర్చుతో అంతకంటే ఎక్కువ సౌకర్యాలను పొందవచ్చు.

అయితే మనతోపాటు మరో 10 మందితో మనం ఆ ఇంటిని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి అద్దె, అడ్వాన్స్ లు, అగ్రిమెంట్లు ఈ జంఝాటం అంతా కో లివింగ్‌లో ఉండదు. మనకు నచ్చినన్ని రోజులు ఉండొచ్చు, నచ్చకపోతే మకాం మార్చేయొచ్చు.

సెటిల్ సంస్థ బెంగళూరు, హైదరాబాద్, పుణెలో ఇలాంటి కో లివింగ్ కేంద్రాలను నిర్వహిస్తోంది. 2023 చివరి నాటికి ఈ సంస్థ హైదరాబాద్‌లో మరో వెయ్యి పడకలతో కో లివింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లోని టెక్ హబ్‌ల చుట్టూ ఈ కో లివింగ్ కేంద్రాలు ఉన్నాయి.

కొవిడ్ కారణంగా వీటికి సడ‌న్‌గా డిమాండ్ తగ్గిపోయింది. తిరిగి ఇప్పుడు పరిస్థితులు మారడంతో మళ్లీ కో లివింగ్ కేంద్రాలకు డిమాండ్ పెరుగుతోంది. హాస్టల్స్, పీజీల కంటే మెరుగైన సౌకర్యాలు ఉండటంతో కాస్త ఖర్చు ఎక్కువైనా కో లివింగ్ వైపు ఉద్యోగులు, యువత అడుగులు వేస్తున్నారు.

First Published:  11 Oct 2022 12:05 PM IST
Next Story