Telugu Global
Telangana

సుందరీకరణ పేరుతో సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం

పేద పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం నీ ప్రాధాన్యమా? లక్ష కోట్లు ఖర్చు చేసి మూసీ సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యమా రేవంత్ రెడ్డి అని నిలదీసిన హరీశ్‌

సుందరీకరణ పేరుతో సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం
X

మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దు. మూసీలోకి మురికి నీరు రాకుండా చెయ్యండని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మూసీలోకి గోదావరి నీళ్లను తెస్తామంటున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే గోదావరి నీళ్లను మూసిలోకీ తెస్తాం అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలి పోయింది అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవ్వాళ గోదావరి నీళ్లను మూసీలోకి ఎలా తీసుకోని వస్తాడు? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్ బాధితులను కలిసేందుకు హైదర్ షా కోట్‌ కు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో బయలుదేరుతున్న మాజీ మంత్రి హరీశ్‌ రావును తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ఎస్సీ , బీసీ హాస్టల్లో పిల్లలకు అన్నం పెట్టడానికి ఏడు నెలల నుంచి మెస్ చార్జీలు లేవు. పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బులు లేవంటావు. మూసీ సుందరీకరణ కోసం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాను అంటున్నావు. నీ ప్రాధాన్యం ఏంది? పేద పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం నీ ప్రాధాన్యమా? లక్ష కోట్లు ఖర్చు చేసి మూసీ సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యమా రేవంత్ రెడ్డి అని హరీశ్‌ నిలదీశారు.

ఇవ్వాల మీడియాలో చూస్తున్నాం... ఆడ పిల్లలకు టాయిలెట్స్ లేకా వందల మంది లైన్లో నిలబడుతున్నారు. పేద పిల్లలకు టాయిలెట్స్ కట్టడం నీ ప్రాధాన్యమా? లక్ష కోట్లు ఖర్చు చేసి మూసీ సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యమా? అని ప్రశ్నించారు. నేను, సబితా ఇంద్రారెడ్డి గారు గాంధీ ఆసుపత్రికీ వెళ్తే రోగులకు మందులు లేక అవస్థలు పడుతున్నారు. డబ్బులు చెల్లించకపోవడంతో ప్రభుత్వానికి మందుల సరఫరా నిలిపివేశారు. కేసీఆర్ కిట్ బంద్ చేశారు. న్యూట్రిషన్ కిట్ బంద్ చేశారు. ఏమిటని అడిగితే డబ్బులు లేక నిలిపివేశామని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం ఒక తుగ్లక్ ప్రభుత్వంగా అయిపోయిందని, ప్రభుత్వ తీరు పిచ్చోడిచేతుల రాయిలా ఉన్నదని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు నిలబెట్టుకోవాలన్నారు.

సోనియాగాంధీని ఒకటే అడుగుతున్న తుక్కుగూడలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలుపుకోండి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారి మెడ మీద కత్తి పెట్టి ఎందుకు మార్క్ చేస్తున్నారు? సుందరీకరణ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. ఫార్మాసిటీకి కేసీఆర్ 15 వేల ఎకరాల భూమి సేకరిస్తే ఫార్మాసిటీని పక్కనపెట్టి ఫోర్త్ సిటీ అని రియల్ ఎస్టేట్ బ్రోకర్ల సహాయంతో ఫోర్త్ సిటీ నిర్మిస్తానని సీఎం అంటున్నాడు. మూసీ డీపీఆర్‌కే రూ.1500 కోట్లు అట! ఇది ప్రపంచంలో ఎక్కడా వినలేదు. రూ.150 కోట్లు ఖర్చు చేస్తే పేద పిల్లలకు అన్నం పెట్టొచ్చు అన్నారు. మూసీలోకి మురుగు నీరు రాకుండా మా హయంలో 32 ఎస్టీపీ లు నిర్మించాం.

అనంతరం హరీష్ రావు నేతృత్వంలోని గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటిస్తున్నారు. హైదర్ షా కోట్ ప్రజలు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్మెంట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

First Published:  29 Sept 2024 6:06 AM GMT
Next Story