తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి మూడు రాష్ట్రాల సీఎంలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుమీద ఏర్పాటు చేసిన తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని ఫిబ్రవరి 17 ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.

తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి మూడు రాష్ట్రాల సీఎంలు
తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ఇదివరకే తేదీ ప్రకటించారు. ఇప్పుడు ప్రారంభోత్సవ సుముహూర్తం కూడా అనౌన్స్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుమీద ఏర్పాటు చేసిన తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని ఫిబ్రవరి 17 ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సహా.. మొత్తం మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సచివాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. ప్రత్యేక అతిథిగా బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ వస్తారు. ఇతర రాష్ట్రాలనుంచి పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
చండీయాగం, సుదర్శన యాగం..
సచివాలయ ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహిస్తారు. సచివాలయం ప్రారంభం తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. ఇప్పుడు సచివాలయ ప్రారంభోత్సవానికి కేరళ, జార్ఖండ్ ముఖ్యమంత్రులు, బీహార్ డిప్యూటీ సీఎం హాజరు కాబోతున్నారు. కేసీఆర్ కి జాతీయ స్థాయిలో ఉన్న పలుకుబడికి ఈ రెండు కార్యక్రమాలే ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు పార్టీ నేతలు.
తెలంగాణ సచివాలయానికి సీఎం కేసీఆర్ 2019 జూన్ 27న భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. రూ.617 కోట్ల నిధులతో సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో నిర్మించారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్ చేశారు.
సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరు లోపు స్మారకాన్ని సిద్ధం చేస్తారు. సచివాలయం సమీపంలో అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 125 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.