Telugu Global
Telangana

లాబీయింగ్ లేదు.. ఆన్ లైన్ లో సీఎంఆర్ఎఫ్

ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్‌ స్వీకరించిన తర్వాత మెడికల్ బిల్లులను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్థారించుకుంటారు. ఆ తర్వాత సచివాలయంలో ఒరిజినల్ బిల్లుల వెరిఫికేషన్ ఉంటుంది.

లాబీయింగ్ లేదు.. ఆన్ లైన్ లో సీఎంఆర్ఎఫ్
X

ఆస్పత్రి ఖర్చులతో సతమతం అయ్యే పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిజంగా పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి. సీఎంఆర్ఎఫ్ నిధులకోసం దరఖాస్తు చేస్తే సహాయం చేతికందేవరకు పెద్ద కసరత్తే చేయాలి. ముందుగా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేదా ఎంపీల సిఫార్సు లేఖలు తీసుకుని రావాలి, ఆ తర్వాత సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు తప్పనిసరి. పెద్దమొత్తంలో సహాయం కావాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఇకపై అలాంటి కష్టాలు ఉండవని అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులన్నీ ఆన్ లైన్ చేస్తామంటోంది.

అన్నీ ఆన్ లైన్ లోనే..

ఇకపై సీఎం ఆర్ఎఫ్ దరఖాస్తులన్నీ ఆన్ లైన్ లో స్వీకరించబోతున్నారు. ఈనెల 15నుంచి ఆన్ లైన్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత నేరుగా దరఖాస్తులు తీసుకోరు. ఆన్ లైన్ ప్రక్రియ కోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సచివాయంలో ప్రారంభించారు. https// cmrf.telangana.gov.in- వెబ్‌సైట్‌లో దరఖాస్తుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖను, మెడికల్ బిల్లులను జతచేసి అప్‌లోడ్‌ చేయాలి. ఆ దరఖాస్తులోనే కుటుంబ సభ్యుల బ్యాంక్‌ ఖాతా వివరాలు తప్పనిసరిగా నమోదుచేయాలి. అప్‌లోడ్‌ చేసిన ప్రతి అప్లికేషన్ కి ఒక నెంబర్ కేటాయిస్తారు. ఆ నెంబర్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో సంబంధిత విభాగంలో అందజేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్‌ స్వీకరించిన తర్వాత మెడికల్ బిల్లులను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్థారించుకుంటారు. ఆ తర్వాత సచివాలయంలో ఒరిజినల్ బిల్లుల వెరిఫికేషన్ ఉంటుంది. ఇవి రెండు సరిపోలితే.. వెంటనే రిలీఫ్ ఫండ్ విడుదలవుతుంది. దరఖాస్తుదారుల పేరిట బ్యాంక్ చెక్ సిద్ధం చేస్తారు. ఆ చెక్ పై వారు సూచించిన అకౌంట్ నెంబర్ ఉంటుంది కాబట్టి, నిధులు పక్కదారి పట్టే అవకాశం లేదని అంటున్నారు. ఆ చెక్కులను ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు.. ఆ కుటుంబ సభ్యులకు అందిస్తారు. పారదర్శకంగా సీఎంఆర్ఎఫ్ ప్రక్రియ జరగాలనే ఉద్దేశంతో ఆన్ లైన్ పద్ధతి తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.

First Published:  3 July 2024 9:20 AM IST
Next Story