24 గంటలు లూటీ చేసేందుకే ఇసుకపై సీఎం రివ్యూ
బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
![24 గంటలు లూటీ చేసేందుకే ఇసుకపై సీఎం రివ్యూ 24 గంటలు లూటీ చేసేందుకే ఇసుకపై సీఎం రివ్యూ](https://www.teluguglobal.com/h-upload/2025/02/13/1403089-krishank.webp)
రాష్ట్రంలోని నదులు, ఉప నదుల నుంచి 24 గంటలు లూటీ చేసేందుకే ఇసుకపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారని బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉండగా, మూడు షిఫ్టుల్లో మైనింగ్ చేయాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలంగాణకు వచ్చి కేసీఆర్ తెచ్చిన ఇసుక పాలసీని ప్రశంసించారని గుర్తు చేశారు. రేవంత్ పాలనలో అక్రమ ఇసుక దందా భారీగా పెరిగిందని.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇసుకపై ఏటా రూ.19 కోట్ల ఆదాయం వస్తే.. కేసీఆర్ కొత్త పాలసీ తెచ్చాక రూ.800 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన ఇసుక ఆదాయం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి జేబులోకి వెళ్తోందన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక పేరుతో టన్నుల కొద్దీ ఇసుకను తరలించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీలు ఖాళీ చేసి మరీ ఇసుక తవ్వుతున్నారని.. ఆ ఆదాయమంతా ఎక్కడికి పోతుందో చెప్పాలన్నారు. ఓవర్ లోడింగ్ పై లారీ ఓనర్స్ అసోసియేషపన్ సైతం అభ్యంతరాలు చెప్తోందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరిగిన ఇసుక అమ్మకాల వివరాలన్నీ స్పీకర్ సమక్షంలో పెట్టాలని డిమాండ్ చేశారు.