Telugu Global
Telangana

ధరణిలో రిపేర్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

2020లో అమల్లోకి వచ్చిన ROR చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ సీఎంకు నివేదించింది. కేవలం 3 నెలల్లో హడావుడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులు వచ్చాయని తెలిపారు.

ధరణిలో రిపేర్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
X

ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మార్చి మొదటి వారంలోనే అన్ని MRO ఆఫీసుల్లో ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలు ఖరారు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో ధరణి కమిటీతో సీఎం రేవంత్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏయే మార్గాలున్నాయని అధికారులతో సీఎం చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

2020లో అమల్లోకి వచ్చిన ROR చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ సీఎంకు నివేదించింది. కేవలం 3 నెలల్లో హడావుడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులు వచ్చాయని తెలిపారు. ఆ రికార్డులనే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవడంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయన్నారు. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా, వాటిని సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ వ‌ర‌కు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవెన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని.. కానీ ఏ మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లింది కమిటీ.

లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండడం రైతులకు భారంగా మారిందని తెలిపారు అధికారులు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవెన్యూశాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయనే చర్చ జరిగింది. ధరణి డేటాను ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయడం, లేదంటే కొత్త ROR చట్టం చేయడం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు సీఎంకు వివరించారు. సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డుల ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరముందని అన్నారు. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అప్పటివరకు తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

First Published:  24 Feb 2024 8:49 PM IST
Next Story