ఎంపీ రేసులో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి.. ఫ్లెక్సీల కలకలం
మహబూబ్‌నగర్ టికెట్ కోసం AICC కార్యదర్శి చల్లా వంశీధర్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సంజీవ్ ముదిరాజ్, ఎన్.పి.వెంకటేశ్, ఆదిత్య రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
మహబూబ్‌నగర్ పట్టణంలో రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే పట్టణంలో ఫ్లెక్సీలు రావడం చర్చనీయాంశంగా మారింది. మహబూబ్‌నగర్ ఎంపీ బరిలో అనూహ్యంగా తిరుపతి రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఎంపీ అభ్యర్థిగా తిరుపతి రెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.
తిరుపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సొంత తమ్ముడు. అయితే ఫ్లెక్సీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో లేకపోవడం గమనార్హం. ఫ్లెక్సీల్లో కేవలం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫొటోలు మాత్రమే ఉన్నాయి. తిరుపతన్న మిత్రమండలి పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. తర్వాత ఈ ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు.
మహబూబ్‌నగర్ టికెట్ కోసం AICC కార్యదర్శి చల్లా వంశీధర్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సంజీవ్ ముదిరాజ్, ఎన్.పి.వెంకటేశ్, ఆదిత్య రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా తిరుపతి రెడ్డి పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు వెనుక మతలబు ఏంటి అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి మరో సోదరుడు కొండల్ రెడ్డి మల్కాజ్‌గిరి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గం నుంచి ఫైనల్ అయిన ముగ్గురి పేర్లలో కొండల్ రెడ్డి పేరు కూడా ఉంది.