ఉన్న జిల్లాలు వద్దంటూనే.. మరో కొత్త జిల్లాకు రేవంత్ హామీ
సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని చాలా గందరగోళంగా ఉంటున్నాయి. 33 జిల్లాలు అవసరం లేదని, జిల్లాల విభజన అసంబద్ధంగా ఉందని ప్రభుత్వం వచ్చిన కొత్తలో విమర్శించారు రేవంత్ రెడ్డి. దానికి అనుగుణంగానే సీఎం ఆదేశాలతో ప్రస్తుతమున్న 33 జిల్లాలను 17కు కుదించే విషయమై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓవైపు ఉన్న జిల్లాలే వద్దు అంటూ.. తాజాగా మరో కొత్త జిల్లాకు హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఖైరతాబాద్ MLA, సికింద్రాబాద్ కాంగ్రెస్ MP అభ్యర్థి దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆయన సీఎంను కలిశారు. జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరించి వినతిపత్రం ఇచ్చారు. ఎంపీ ఎన్నికలు ముగిసిన అనంతరం జిల్లా ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు పవన్ కుమార్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 10 జిల్లాలు ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి సంఖ్యను 33కు పెంచింది. ఆయా జిల్లాల్లో నూతన కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారడంతో జిల్లాల సంఖ్యను కుదించే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా 17 జిల్లాలు ఏర్పాటు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం.