Telugu Global
Telangana

33నుంచి 17కు తగ్గిపోతున్న జిల్లాలు.. ఎప్పట్నుంచంటే..?

జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అస్తవ్యస్తంగా జరిగిందని, కొన్ని నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయని, అలాంటి చోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.

33నుంచి 17కు తగ్గిపోతున్న జిల్లాలు.. ఎప్పట్నుంచంటే..?
X

తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ పాలన చూపిస్తానంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలన్నిటినీ ఆయన సమీక్షిస్తున్నారు, సమూలంగా మార్చేస్తున్నారు. ముందుగా TS స్థానంలో TG తీసుకొచ్చారు. ఈ క్రమంలో విమర్శలు వినపడుతున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గేలా లేరు. తాజాగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై కీలక నిర్ణయం తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. 33 జిల్లాలను 17కు కుదించబోతున్నారు.

తెలంగాణలో జిల్లాల సంఖ్య పెంచడం వల్ల పాలన సులభతరం అయిందని, చాలా చోట్ల జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. జిల్లాలను కుదిస్తే వ్యవస్థలన్నీ తిరిగి అస్తవ్యస్తమవుతాయని చెబుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం జిల్లాల సంఖ్య తగ్గించే విషయంలో తగ్గేది లేదంటున్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అస్తవ్యస్తంగా జరిగిందని, కొన్ని నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయని, అలాంటి చోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. తెలంగాణలో 17 జిల్లాలు ఉండటం సముచితం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. జిల్లాల కుదింపు వల్ల సామాన్యులకు కొత్త ఇబ్బందులు తలెత్తకుండా ఉంటే మాత్రం రేవంత్ నిర్ణయం సరైనదే అనుకోవాలి, లేకపోతే లేనిపోని కొత్త కష్టాలు రేవంత్ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.

తెలంగాణ తల్లి విగ్రహ రూపు రేఖలు మార్చడంతోపాటు, సంక్షేమ పథకాల పేర్లు కూడా దాదాపుగా మార్చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ‘మన ఊరు – మన బడి’ స్కీమ్ ఉండగా దాని స్థానంలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు’ అనే కొత్త వ్యవస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘రైతుబంధు’ స్కీమ్ ‘రైతుభరోసా’గా, ‘ఆసరా’ స్కీమ్ ‘చేయూత’గా మారిపోతున్నాయి. మొత్తం 12 పథకాలకు మార్పులు జరగబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. టీఎస్-ఐపాస్ పాలసీని విభజించి వేర్వేరు పాలసీలను రూపొందించబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకోసం రూపొందించిన ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’కి కూడా ప్రత్యామ్నాయం వెదికే ఆలోచనలో ఉన్నారు అధికారులు.

మార్పులు ఎప్పట్నుంచి..?

పాలనలో బీఆర్ఎస్ మార్క్ లేకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. లోక్ సభ ఎన్నికల హడావిడి పూర్తయ్యాక, స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఒక్కో మార్పు తెరపైకి వస్తుంది. ఏడాది చివర్లోగా ఈ మార్పులన్నీ అమలులోకి వస్తాయని అంటున్నారు.

First Published:  24 May 2024 9:06 AM IST
Next Story