Telugu Global
Telangana

రేవంత్ టార్గెట్ కేసీఆర్‌.. బాబుకు గుచ్చుకుంటున్న బాణాలు

కృష్ణా జలాలపై తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇందులో భాగంగా కృష్ణా జలాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శాసనసభ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

రేవంత్ టార్గెట్ కేసీఆర్‌.. బాబుకు గుచ్చుకుంటున్న బాణాలు
X

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య నీటి పంపకాల విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి టార్గెట్ చేశారు. అది వైఎస్‌ జగన్‌కు ప్లస్‌ కావడమే కాకుండా ఏపీలోని ప్రతిపక్షాల విమర్శలకు చెక్‌ పెడుతోంది. రేవంత్, ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌ను వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుంటున్నారు. జగన్‌ను అభినందిస్తూ, చంద్రబాబును ప్రశ్నిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు

కృష్ణా జలాలపై తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇందులో భాగంగా కృష్ణా జలాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శాసనసభ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా స్వరాష్ట్రంలో తెలంగాణకు నీటి వాటాలో నష్టం జరిగిందని ఆయన అన్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో కేసీఆర్‌ స్నేహం చేసినందువల్లనే పోతిరెడ్డిపాడు నుంచి జలదోపిడీ జరిగిందని ఆయన విమర్శించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి తెలంగాణకు రావాల్సిన నీళ్లను రాయలసీమకు తరలించుకుపోయారని ఆయన చెప్పారు.

కేసీఆర్‌, జగన్‌ మధ్య చర్చలు జరిగిన ప్రతిసారీ నదీజలాల వాటా అంటూ మీడియా వార్తలు ఇచ్చిందని, నిజానికి వారిద్దరూ సమావేశమైన ప్రతీ సందర్భంలోనూ తెలంగాణకు అన్యాయమే జరిగిందని ఆయన అన్నారు. అదే సమయంలో.. ఏపీ అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌ మాట్లాడిన ఓ వీడియోను కూడా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అసెంబ్లీలో ప్ర‌ద‌ర్శించారు.

కేసీఆర్‌ తెలంగాణకు అన్యాయం చేస్తే, జగన్‌ రాయలసీమ ప్రయోజనాలను కాపాడరని ఉత్త‌మ్‌ అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో 44 వేల‌ క్యూసెక్కులు ఉంటే, 2020లో జగన్‌ దాని సామర్థ్యాన్ని 90 వేలకు పెంచారని ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ మాటలను ఉటంకిస్తూ రాయలసీమకు మంచి చేసిందంటే అది వైఎస్‌ ఫ్యామిలీనే అంటూ వైసీపీ అభిమానులు సోష‌ల్ మీడియాలో టీడీపీని టార్గెట్ చేస్తూ పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.

న‌దీ జ‌లాల‌పై తెలంగాణ ప్రభుత్వ వాదన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు మైనస్‌ కూడా అవుతోంది. రాయలసీమకు ఒక్క చుక్క నీటిని కూడా చంద్రబాబు అందించలేదని, ఏదైనా ఆ ప్రాంతానికి మేలు జరిగిందంటే అది వైఎస్‌ కుటుంబం ద్వారానే అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వాదనను వైసీపీ కార్యకర్తలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. జగన్‌ రెడ్డి ఆంధ్రను కేసీఆర్‌ వద్ద తాకట్టు పెట్టాడని మాట్లాడిన టీడీపీ, జనసేన ముఖ చిత్రాలేమిటో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

First Published:  13 Feb 2024 12:42 PM IST
Next Story