పేదలపై ప్రతాపం చూపుతున్న సీఎం రేవంత్
హైడ్రా పేరుతో కూల్చివేతలను ఆపాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
సీఎం రేవంత్‌రెడ్డి పేదలపై ప్రతాపం చూపుతున్నారు. కూల్చివేతలను ఆపాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేయాలని ఆలోచించింది. గతంలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. డ్రైనేజీ పైపులను మూసీలో కలుపుతున్నారు. దీంతో తాగునీరు, డ్రైనేజీ కలిసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండానే మూసీ ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని ప్రభుత్వాన్ని కోరాం. విధ్వంసాన్ని ఆపాలని ముఖ్యమంత్రికి లేఖ రాశానని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం న్యాయం కాదని కిషన్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌లోని 70 శాతం డ్రైనేజీ నీళ్లు మూసీలోకి వెళ్తాయి. మూసీని సుందరీకరణ చేస్తే డ్రైనేజీ నీళ్లు ఎక్కడికి వెళ్తాయో చెప్పాలని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. డ్రైనేజీ సమస్య తీర్చకుండా సుందరీకరణ చేయడం అనాలోచిత చర్య అన్నారు. మూసీకి ఇరువైపులా ముందు రిటైనింగ్ వాల్ కట్టండి అని.. తర్వాత మూసీ సుందరీకరణ చేసుకోవచ్చని సూచించారు పేదలు ఎవరి హయాంలో ఇళ్లు నిర్మించుకున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడే ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. ధనికుల ఫాంహౌస్‌లు కూల్చే దమ్ము రేవంత్‌రెడ్డి సర్కార్‌కు ఉన్నదా? అని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఒవైసీ ఫాతిమా నిర్మాణాకలు ఎందుకు సమయం ఇచ్చారని కేంద్ర మంత్రి నిలదీశారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. ఆమె వ్యాఖ్యలను ఖండించారు. మహిళలు, కుటుంబాల గురించి మాట్లాడటం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అలవాటైందని విమర్శించారు.