సికింద్రాబాద్, వరంగల్ పై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. ఎందుకంటే..?
కొత్తగా పార్టీలోకి వచ్చిన అభ్యర్థులు నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు రేవంత్ రెడ్డి. కొత్త, పాత విభేధాలు లేకుండా నాయకులంతా కలసి పనిచేయాలన్నారు.
సికింద్రాబాద్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో కీలక సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ రెండు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు, ఇతర కీలక నేతలతో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకుందని, అందులో ఈ రెండు సెగ్మెంట్‌లు ఉండాలని ఆయన తేల్చి చెప్పారు. ఆ దిశగా నాయకులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
ఆ రెండే కీలకం..
సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కి సీటిచ్చారు. వరంగల్ లో మరో ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అంటే ఈ రెండు నియోజకవర్గాల విషయంలో సొంత పార్టీలో అభ్యర్థులున్నా కూడా కాంగ్రెస్ పక్క పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని మరీ రిస్క్ చేసింది. పక్క పార్టీనుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమార్తె.. పరాజయం పాలయ్యారంటే అది మరింత పరువు తక్కువ. బీఆర్ఎస్ ముందు తలకొట్టేసినట్టవుతుంది, అధిష్టానం ముందు సీఎం మాట పడాల్సి వస్తుంది. అందుకే ఆ రెండు నియోజకవర్గాలపై రేవంత్ మరింత ఫోకస్ పెట్టారు.
కొత్తగా పార్టీలోకి వచ్చిన అభ్యర్థులు నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు రేవంత్ రెడ్డి. కొత్త, పాత విభేధాలు లేకుండా నాయకులంతా కలసి పనిచేయాలన్నారు. పార్టీ విజయం కోసం నేతలంతా సమన్వయంతో పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ బూత్ కమిటీలను మండలం నుంచి జిల్లా స్థాయి వరకు ఏర్పాటు చేయాలని సూచించారు రేవంత్ రెడ్డి. ప్రతి కమిటీలోని కీలక సభ్యులంతా ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకొని, ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేయాలన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ మీటింగ్‌లకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర కీలక నేతలు హాజరయ్యారు.