ఆగస్టు 15.. రేవంత్ కొత్త వాయిదా
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అమలు చేసిన విధంగానే.. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు.
తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కొత్త వాయిదా కోరారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఎలక్షన్ కోడ్ వల్లే రుణమాఫీ చేయలేకపోయామన్నారు.
రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతాంగానికి నారాయణపేట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నానన్నారు రేవంత్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అమలు చేసిన విధంగానే.. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఇక వరి ధాన్యానికి రూ.500 బోనస్ సైతం వచ్చే సీజన్ నుంచి ఇస్తామన్నారు రేవంత్. బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి. తన ఇంట్లో తప్పు జరిగితే జాతీయ స్థాయిలో చెప్పుకునే పరిస్థితి ఉండదన్నారు. తనను పడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని మరోసారి ఆరోపించారు.