Telugu Global
Telangana

థేమ్స్ ప్రణాళిక.. మూసీకి పనికొచ్చేనా..?

పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా మూసీకి పూర్వ వైభవం తీసుకువస్తే.. నదులు, సరస్సులతో హైదరాబాద్ నగరం మరింత శక్తిమంతంగా తయారవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

థేమ్స్ ప్రణాళిక.. మూసీకి పనికొచ్చేనా..?
X

అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూసీ నది ప్రక్షాళణ కోసం కృషి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆ దిశగా ఇప్పుడు కార్యాచరణ మొదలుపెట్టారు. దావోస్ ప్రకటన తర్వాత లండన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ థేమ్స్ నదీ వ్యవస్థ, దాని అభివృద్ధి తీరుని పరిశీలించారు. థేమ్స్ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన విధానాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవానికి థేమ్స్ ప్రణాళికను అమలులో పెట్టేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. థేమ్స్‌ నది పాలకమండలి, పోర్ట్‌ ఆఫ్‌ లండన్‌ అథారిటీ ఉన్నతాధికారులు, నిపుణులతో చర్చించారు.


నదులు, సరస్సులు, సముద్రతీరం వెంట ఉన్న నగరాలన్నీ చరిత్రాత్మక అభివృద్ధిని సాధించాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ నగరానికి అలాంటి ప్రత్యేకత ఉందని, మూసీ నదితోపాటు.. హుస్సేన్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ వంటివి హైదరాబాద్ కు అదనపు బలాలని చెప్పారు. పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా మూసీకి పూర్వ వైభవం తీసుకువస్తే.. నదులు, సరస్సులతో హైదరాబాద్ నగరం మరింత శక్తిమంతంగా తయారవుతుందన్నారు. మూసీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు తెలిపారు రేవంత్ రెడ్డి.

2050నాటికి..

విజన్‌ 2050కి అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టడంపై లండన్‌ అధికారులతో సీఎం చర్చలు జరిపారని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. నది ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యతనివ్వాలని ఈ సందర్భంగా లండన్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. నదీజలాలు ఎల్లప్పుడూ సుస్థిరంగా ఉంచాలని, స్థానికులకు ఎక్కువ ప్రయోజనం ఉండే రెవెన్యూ మోడల్‌ ఎంచుకోవాలన్నారు. మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్‌ ఆఫ్‌ లండన్‌ అథారిటీ తెలంగాణ ప్రతినిధులకు హామీ ఇచ్చింది.

First Published:  20 Jan 2024 4:49 AM
Next Story