మరో రెండు హామీలు అమలు.. ఇవాళే ప్రకటన
రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఐదు గ్యారంటీల కోసం మొత్తం కోటి 9 లక్షల 12 వందల 55 దరఖాస్తులు వచ్చాయి.
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మరో రెండు హామీల అమలుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. గురువారం ప్రజా పాలన కార్యక్రమంపై సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. ఆరు గ్యారంటీల అమలుపై కేబినెట్ సబ్‌కమిటీతో చర్చించారు.
రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాల్లో ఏవైనా రెండు ఎంపిక చేసి అమలు చేస్తామని చెప్పారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని అధికారులకు సూచించారు. త్వరలో అమలు చేయబోయే రెండు పథకాలపై ఇవాల్టి ఇంద్రవెల్లి సభలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఐదు గ్యారంటీల కోసం మొత్తం కోటి 9 లక్షల 12 వందల 55 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12 నాటికే డేటా ఎంట్రీ పూర్తయిందని అధికారులు సీఎంకు నివేదించారు. అయితే ఇందులో కొందరు రెండు కన్నా ఎక్కువ సార్లు దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. కొన్నింటికి ఆధార్, రేషన్ కార్డు నంబర్లు లేవని తెలిపారు. మొత్తం 2 లక్షల 82 వేల డూప్లికేట్ దరఖాస్తులు గుర్తించామన్నారు అధికారులు. అర్హులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి.