Telugu Global
Telangana

వరంగల్ కి నా పూర్తి సహకారం -సీఎం రేవంత్

ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 518,71,20,000 చెక్కుని సీఎం రేవంత్ రెడ్డి అందించారు. ఈ సాయం వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఇస్తుందన్నారాయన.

వరంగల్ కి నా పూర్తి సహకారం -సీఎం రేవంత్
X

హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ని అభివృద్ధి చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. వరంగల్‌ పర్యటనలో బిజీబిజీగా గడిపిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. వరంగల్ ను హెరిటేజ్‌ సిటీగా తీర్చిదిద్దటానికి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి. ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలన్నారు. ఓఆర్‌ఆర్‌ నుంచి టెక్స్‌టైల్‌ పార్కును అనుసంధానించాలని చెప్పారు. స్మార్ట్‌సిటీలో భాగంగా భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేయాలని, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


వరంగల్ లో మెడికవర్ గ్రూప్ కి చెందిన 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించామన్నారాయన. విద్య, వైద్యం, విద్యుత్ అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమవుతుందని, హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. ఇప్పుడు వరంగల్ ని కూడా విశ్వ నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వివరించారు. వరంగల్ లో హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

వరంగల్ నగరంలోని టెక్స్‌టైల్ పార్క్‌లో వన మహోత్సవం లోగోను ఆవిష్కరించిన సీఎం రేంత్ రెడ్డి, ఆ తర్వాత ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష చేపట్టారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 518,71,20,000 చెక్కుని సీఎం రేవంత్ రెడ్డి అందించారు. ఈ సాయం వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఇస్తుందన్నారు. వ్యక్తిగతంగా ఇది తనకెంతో సంతోషకరమైన విషయం అని చెప్పారు రేవంత్ రెడ్డి.

First Published:  29 Jun 2024 11:15 PM IST
Next Story