ఆరు గ్యారంటీలకు ఒకటే అప్లికేషన్.. ప్రజాపాలనలో అప్లయ్ చేసుకోవడమే
ఈ ఆరు గ్యారంటీలకు కలిపి ఒకటే అప్లికేషన్ ఫాం ఉంటుంది. రేపు అంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ఈ అభయ హస్తానికి అప్లయ్ చేసుకోవాలని అర్హులందర్నీ సీఎం రేవంత్ కోరారు.
తెలంగాణలో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు దిశగా అడుగులు వేస్తోంది. సచివాలయంలో ఆరు గ్యారంటీల అభయహస్తం లోగోను సీఎం రేవంత్‌రెడ్డి ఈ రోజు ఆవిష్కరించారు. ఆరు గ్యారంటీలకు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
రేపటి నుంచి జనవరి 6వరకు అప్లికేషన్లు
ఈ ఆరు గ్యారంటీలకు కలిపి ఒకటే అప్లికేషన్ ఫాం ఉంటుంది. రేపు అంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ఈ అభయ హస్తానికి అప్లయ్ చేసుకోవాలని అర్హులందర్నీ సీఎం రేవంత్ కోరారు. ప్రజాపాలన పేరిట జరిగే గ్రామసభల్లో అప్లికేషన్లు తీసుకోవడానికి స్త్రీ, పురుషులకు వేర్వేరుగా లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామసభల్లో అప్లికేషన్లు ఇవ్వలేకపోతే తర్వాత ఆయా మండలాల ఎమ్మార్వో లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇందుకోసం ఎమ్మార్వో, ఎంపీడీవోలతో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసినట్లు సీఎం ప్రకటించారు.
6 గ్యారంటీల దరఖాస్తు ఫామ్‌లో రేషన్ కార్డు నంబర్‌ను ప్రభుత్వం అడిగింది. రేషన్ కార్డు ఉన్నవాళ్లు ఇక్కడ నంబర్ వేస్తారు. లేనివాళ్లు రేషన్ కార్డు లేదు అని రాస్తే సరిపోతుంది. వాస్తవానికి 6 గ్యారంటీల అమలుకు రేషన్ కార్డే ప్రామాణికం. కానీ, ఇపుడు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలంటే చాలా సమయం పడుతుంది. పదేళ్లలో గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు. ఎన్నికల ముందునాటికే 11లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పాత రేషన్ కార్డులే 89లక్షల వరకు ఉన్నాయి. ఇందులో అనర్హులు కూడా పెద్దసంఖ్యలో ఉండటంతో ప్రక్షాళన అవసరమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.