Telugu Global
Telangana

ఇది ట్రైలర్ మాత్రమే.. సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్

ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో KRMB వ్యవహారాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. వాడి వేడి చర్చ జరిగే అవకాశముంది.

ఇది ట్రైలర్ మాత్రమే.. సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
X

తెలంగాణలో ప్రస్తుతం కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ (KRMB) వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందంటూ బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే అలాంటిదేమీ జరగలేదని కాంగ్రెస్ చెబుతోంది. మీటింగ్ మినిట్స్ లో ఆ విషయం స్పష్టంగా ఉందని, కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చిందని కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే విషయంపై నల్లగొండలో భారీ నిరసన సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ దశలో KRMB వ్యవహారంపై ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా భవన్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, తొమ్మిదిన్నరేళ్లలో విధ్వంసమై తెలంగాణ జలదృశ్యాన్ని జనం ముందు ఉంచడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధమైందని ట్వీట్ వేశారు సీఎం రేవంత్ రెడ్డి.


కాంగ్రెస్ కి కావాల్సింది ఇదేనా..?

ఆరు గ్యారెంటీలకు 100 రోజుల డెడ్ లైన్ పెట్టిన కాంగ్రెస్ ని అదే అంశంలో ఇరుకున పెట్టాలని, లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బకొట్టాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఆలోగా గ్యారెంటీల అమలు అసాధ్యం కాబట్టి ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటోంది కాంగ్రెస్. వీరికి KRMB వ్యవహారం కలిసొచ్చింది. ప్రస్తుతం బీఆర్ఎస్.. KRMB పైనే ఫోకస్ పెంచింది. నల్లగొండ సభతో కాంగ్రెస్ ని టార్గెట్ చేయాలనుకుంటోంది. ప్రతిగా కాంగ్రెస్ కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తోంది.

ఏపీ నిజంగానే లాభపడిందా..?

కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్ట్ ల నిర్వహణపై హక్కులను KRMBకి అప్పగిస్తే తెలంగాణ ప్రాంతం నష్టపోతుందని, పరోక్షంగా ఏపీ లాభపడుతుందనేది బీఆర్ఎస్ వాదన. అయితే ఏపీకి లాభం చేకూర్చే పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, రాయలసీమకు ఎక్కువ నీటిని విడుదల చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలే దీనికి నిదర్శనం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఈ వ్యవహారాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నారు, బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టేందుకు డిసైడ్ అయ్యారు. KRMB వ్యవహారంపై ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగే అవకాశముంది.

First Published:  12 Feb 2024 7:33 AM IST
Next Story