Telugu Global
Telangana

భారీ టార్గెట్.. రేవంత్ ఇబ్బంది పడతారా..?

ఇటీవలే అధికారంలోకి వచ్చిన రాష్ట్రం కాబట్టి తెలంగాణపై అధిష్టానం కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. ఆ ఆశల్ని నిలబెట్టాలంటే రేవంత్ రెడ్డి మరింత శ్రమించక తప్పదు.

భారీ టార్గెట్.. రేవంత్ ఇబ్బంది పడతారా..?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిచిన సీట్లు 68. ఆ లెక్కన అదే జోరు లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ చూపిస్తే 17 లోక్ సభ స్థానాల్లో వారు గెలవగలిగే గరిష్ట సీట్లు 10. కానీ ఇక్కడ కాంగ్రెస్ అగ్ర నేతలు కూడా తమ టార్గెట్ 14 నుంచి 15 స్థానాలు అని చెబుతున్నారు. పోనీ ఇటీవల ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు, మరికొంతమంది లోపాయికారీగా సహకరిస్తారని అంచనా వేసుకున్నా కాంగ్రెస్ 11 సీట్ల దగ్గర ఆగే అవకాశం ఉంది. ఈ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ కాస్తో కూస్తో మైలేజీ పెంచుకుందని అనుకున్నా.. రైతులకు సాగునీరు, కరెంటు కష్టాలు గ్రామాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్లుగా ఉన్నాయి. పెన్షన్ల పెంపు జరగలేదు, గృహజ్యోతి అమలు అరకొరగానే సాగింది, తులం బంగారం వంటి హామీలు అలానే ఉన్నాయి. సో.. తెలంగాణలో కాంగ్రెస్ కి లోక్ సభ ఎన్నికల్లో 10 స్థానాలు రావడం అసాధ్యం అని తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూడా పుంజుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బతో బీఆర్ఎస్ మరింత కసిగా ఉంది. ఇక ఎంఐఎంకి హైదరాబాద్ సీటు వదిలేసుకున్నా.. కాంగ్రెస్ 10 స్థానాలు అందుకోవడం కూడా కష్టం అని స్పష్టమైంది. మరి 14 సీట్లు అంటూ రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకుని, దాన్ని హైలైట్ చేస్తున్నారంటే.. రేపు ఫలితాలు తేడా కొడితే ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే కదా.

రేవంత్ పైనే భారం..

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నేతలంతా రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. మంత్రులు కూడా తమ పోర్ట్ ఫోలియోలతో సరిపెట్టుకుని సైలెంట్ గా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల విషయంలో సమీక్షలు, సమావేశాలంటూ పెద్దగా హడావిడి జరగడంలేదు. ఈ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేయక తప్పదని తేలిపోయింది. ఇటీవలే అధికారంలోకి వచ్చిన రాష్ట్రం కాబట్టి తెలంగాణపై అధిష్టానం కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. ఆ ఆశల్ని నిలబెట్టాలంటే రేవంత్ రెడ్డి మరింత శ్రమించక తప్పదు. ఆ శ్రమకు తగ్గ ఫలితం వస్తే కాంగ్రెస్ లో ఆయన్ని ఎవరూ వేలెత్తి చూపించరు. ఫలితాలు తేడా కొడితే మాత్రం అన్ని వేళ్లూ రేవంత్ రెడ్డి వైపే ఉంటాయి. ప్రతిపక్షాల స్వరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

First Published:  15 April 2024 8:38 AM IST
Next Story