హైదరాబాద్ వరద కష్టాలు.. సీఎం రేవంత్ కీలక సూచనలు
వర్షాలు పడితే హైదరాబాద్ లో వరద తీవ్రత ఎక్కువగా ఉండే 141 ప్రాంతాలను గుర్తించారు అధికారులు. ఆయా ప్రాంతాల్లో వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
వర్షాకాలంలో హైదరాబాద్ వాసుల కష్టాలు చెప్పనలవి కాదు. లోతట్టు ప్రాంతాల మునక, పొంగిపొర్లే నాళాలు, ప్రాణాలు తీసే మ్యాన్ హోళ్లు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. ఇవన్నీ సహజం. ప్రతిపక్షంలో ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు అవే విమర్శలను కాచుకోవాల్సి వస్తోంది. దీంతో ఈ కష్టాలకు ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళనతో డ్రైనేజీ వ్యవస్థ కాస్తయినా మెరుగుపడుతుందని అంటున్నారు. మరోవైపు అధికారులతో కలసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
తాజాగా హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు, సీఎస్, డీజీపీ సందర్శించారు. వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్ గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ ను సంకలనం చేయాలన్నారు. ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ప్రమాదంపై సమాచారం వచ్చిన వెంటనే స్పందించేలా అలర్ట్ గా ఉండాలన్నారు.
141 ప్రాంతాలు..
వర్షాలు పడితే హైదరాబాద్ లో వరద తీవ్రత ఎక్కువగా ఉండే 141 ప్రాంతాలను గుర్తించారు అధికారులు. ఆయా ప్రాంతాల్లో వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వరదనీరు వెంటనే డ్రైనేజీల ద్వారా బయటకు వెళ్లేందుకు వాటర్ హార్వెస్ట్ లు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎంకు అధికారులు తెలిపారు. రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా పటిష్ట చర్యలు చేపడతామన్నారు.
వర్షాల సమయంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేసేందుకు అవసరమైతే ఎఫ్ఎం రేడియో సహాయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పై ఆధారపడకుండా.. వర్షాలు పడిన తర్వాత ఫిజికల్ పోలీసింగ్ విధానం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. సిబ్బంది కొరత లేకుండా హోమ్ గార్డుల రిక్రూట్ మెంట్ చేపట్టాలని ఆదేశించారు. ఈ మార్పులన్నీ అమలులోకి వస్తే హైదరాబాద్ వాసుల వరద కష్టాలు కొంతమేరయినా తీరిపోతాయేమో చూడాలి.