Telugu Global
Telangana

ఆర్థిక నియంత్రణ పాటిస్తూ ఆరు గ్యారెంటీలు..

ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ఆరు గ్యారంటీల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే వంద రోజుల టార్గెట్ అనేది ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం.

ఆర్థిక నియంత్రణ పాటిస్తూ ఆరు గ్యారెంటీలు..
X

పిల్లి శాపాలకు ఉట్లు తెగిపడవని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయకూడదని, కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరగాలని కొంతమంది ఆశ పడుతున్నారని, వారి ఆశల్ని వమ్ము చేస్తూ ఒక్కో గ్యారెంటీ అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు. సోనియాగాంధీ మాట ఇస్తే తప్పరని, తెలంగాణ ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నారని, గ్యారెంటీల విషయంలో కూడా ఆమె మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెడుతోందని చెప్పారు రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు చెప్పారు రేవంత్ రెడ్డి.


ఆర్థిక నియంత్రణ..

ఆరు గ్యారెంటీలు అమలు చేయడం అసాధ్యమని అంటోంది బీఆర్ఎస్. అలవికాని, అమలు సాధ్యం కాని హామీలిచ్చిన కాంగ్రెస్ చేతులెత్తేస్తుందనేది వారి లాజిక్. అయితే ఆర్థిక నియంత్రణ పాటిస్తూ తాము ఆ హామీలన్నీ అమలు చేస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ఆరు గ్యారంటీల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. అయితే వంద రోజుల టార్గెట్ అనేది ఆయన ఇక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం.

కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ రూ.400గా ఉండేదని, బీజేపీ హయాంలో అది రూ.1200కి తీసుకెళ్లారని పేదలపై భారం తగ్గించేందుకే తాము ఈ పథకాన్ని ప్రకటించామన్నారు రేవంత్ రెడ్డి. చేవెళ్లలో లక్షమంది మహిళల ముందు రెండు గ్యారంటీలను ప్రారంభించాలనుకున్నామని.. ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ వల్ల చేవేళ్లలో ప్రారంభించలేకపోయామని వివరణ ఇచ్చారాయన. స్పీకర్, మంత్రులు, ఇతర నేతల సమక్షంలో సెక్రటేరియట్ లో రెండు గ్యారంటీలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.

First Published:  27 Feb 2024 5:38 PM IST
Next Story