Telugu Global
Telangana

ప్రేమను పంచుతాం.. పెత్తనాన్ని ప్రశ్నిస్తాం

ప్రజల ఆకాంక్షల మేరకే టీఎస్ ను టీజీగా మార్చామని, సగటు గ్రామీణ మహిళ రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలన్నారు రేవంత్ రెడ్డి.

ప్రేమను పంచుతాం.. పెత్తనాన్ని ప్రశ్నిస్తాం
X

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఉపన్యాసం ఇచ్చారు. తెలంగాణ డ్రీమ్‌- 2050 మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని వివరించారు. తెలంగాణను 3 జోన్లుగా విభజన చేసి అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్‌ తెలంగాణ, ఓఆర్‌ఆర్‌ నుంచి రీజనల్ రింగ్‌రోడ్డు ప్రాంతం వరకు సబ్‌ అర్బన్‌ తెలంగాణ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూడు ప్రాంతాలకూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.

పెత్తనాన్ని ప్రశ్నిస్తాం..

తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛ అని.. ఇక్కడి ప్రజలు బానిసత్వాన్ని భరించరని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం రాష్ట్ర ప్రజల తత్వమని, సంక్షేమం ముసుగులో చెరబట్టాలని చూస్తే ఇక్కడి సమాజం సహించదని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని చెప్పారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఇందిరా పార్కులో ధర్నాలకు అనుమతి ఇచ్చామని, ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకే టీఎస్ ను టీజీగా మార్చామని, సగటు గ్రామీణ మహిళ రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలన్నారు రేవంత్ రెడ్డి.


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను మరోసారి ప్రజలకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. తాలు, తరుగు లేకుండా ధాన్యం కొంటున్నామని, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొంటున్నామని చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ.7,500 కోట్లు జమ చేశామన్నారు. మూసీ సుందరీకరణ కార్యక్రమం కోం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ప్రజల అవసరాలకు తగినట్లు మెట్రో విస్తరణ జరుగుతోందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు ఇచ్చే ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. డ్రగ్స్‌, గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పిన ఆయన.. వాటి వెనక ఎంత పెద్ద వారున్నా వదిలిపెట్టబోమన్నారు. ఆరోగ్యశ్రీ పరిధి పెంచామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళణ చేశామని, డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని వివరించారు రేవంత్ రెడ్డి. ఈ అభివృద్ధిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

First Published:  2 Jun 2024 3:04 PM IST
Next Story