Telugu Global
Telangana

మూసీ అభివృద్ధికి రూ.లక్షా 50 వేల కోట్లు - రేవంత్ రెడ్డి

హైదరాబాద్ అభివృద్ధికి హైడ్రా వ్యవస్థను తీసుకువస్తున్నామని చెప్పారు. గోపన్‌పల్లిలో ఎకరం భూమి రూ.100 కోట్లు పలుకుతోందని, ఐటీ, ఫార్మా సంస్థల వల్లే భూమి ధర పెరిగిందన్నారు రేవంత్.

మూసీ అభివృద్ధికి రూ.లక్షా 50 వేల కోట్లు - రేవంత్ రెడ్డి
X

మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కోసం రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని చెప్పారు. గోపన్‌పల్లి ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ ఫ్లై ఓవర్‌ ద్వారా శేరిలింగంపల్లి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. శేరిలింగంపల్లిని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు రేవంత్.


తెలంగాణకు 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే వస్తోందని.. హైదరాబాద్‌కు ఎవరొచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. దేశం నలుమూలల నుంచి ఎవరు వచ్చినా అక్కున చేర్చుకుంటామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి హైడ్రా వ్యవస్థను తీసుకువస్తున్నామని చెప్పారు. గోపన్‌పల్లిలో ఎకరం భూమి రూ.100 కోట్లు పలుకుతోందని, ఐటీ, ఫార్మా సంస్థల వల్లే భూమి ధర పెరిగిందన్నారు రేవంత్.

మూసీని ప్రక్షాళన చేసే బాధ్యత తనదేనన్నారు రేవంత్ రెడ్డి. ఇందుకోసం రాబోయే ఐదేళ్లలో లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు మూసీని సందర్శించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీని చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు.

First Published:  20 July 2024 11:36 AM GMT
Next Story