కోదండరామ్‌కు ఇచ్చే పదవి ఇదే.. తేల్చేసిన రేవంత్ .!
కౌన్సిల్‌లో ప్రస్తుత పరిస్థితి ఇరానీ కేఫ్‌లో కూర్చుని రియల్ ఎస్టేట్ అమ్మకాలు, కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకున్నట్లు ఉందన్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఉద్యమకారుడు కోదండరామ్‌కు ఇచ్చే పదవిపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలకు ముందు కోదండరామ్‌కు ఇచ్చిన హామీని త్వరలోనే నిలబెట్టుకుంటామన్నారు. ఎన్నికలకు ముందు నుంచే తెలంగాణ జన సమితితో తమకు ఒప్పందం ఉందని.. అందులో భాగంగా ఆ పార్టీకి రెండు ఎమ్మెల్సీ పదవులు, కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు.
తొందర్లోనే కోదండరామ్ ఎమ్మెల్సీ కాబోతున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. కోదండరామ్‌ను తక్షణమే ఎమ్మెల్సీని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు కూడా ఆయనను చట్టసభల్లో చూడాలని కోరుకుంటున్నారన్నారు రేవంత్ రెడ్డి. గవర్నర్ కోటాలో కోదండరామ్‌ను పెద్దల సభకు పంపుతామన్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి.
కౌన్సిల్‌లో ప్రస్తుత పరిస్థితి ఇరానీ కేఫ్‌లో కూర్చుని రియల్ ఎస్టేట్ అమ్మకాలు, కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకున్నట్లు ఉందన్నారు రేవంత్ రెడ్డి. తాను తొలిసారి ఎమ్మెల్సీగా సభకు వచ్చినప్పుడు చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు లాంటి వాళ్లు ఉండేవారని గుర్తు చేసుకున్నారు. త్వరలోనే కోదండరామ్‌ను చట్టసభలకు పంపిస్తామని.. ఆయన సభకు వస్తే వాటి గౌరవం పెరుగుతుందన్నారు.