Telugu Global
Telangana

మానవీయ కోణంలో నిర్ణయాలు -రేవంత్ రెడ్డి

తెలంగాణలో రోడ్ కనెక్టివిటీ విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెద్దగా సాయం చేసిందేమీ లేదు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు ఉన్నా కూడా గతంలో రాష్ట్రానికి సహాయ నిరాకరణే జరిగింది.

మానవీయ కోణంలో నిర్ణయాలు -రేవంత్ రెడ్డి
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జాతీయ రహదారుల నిర్మాణంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డు, మంచిర్యాల - వరంగల్ - ఖమ్మం - విజయవాడ కారిడార్ భూ సేకరణ పురోగతిపై చర్చించారు. రహదారులు నిర్మాణంలో ఉన్న పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు సేకరించారు. రహదారుల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.


రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో బాధితులకు చెల్లించే పరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రహదారుల నిర్మాణంలో పొలాలు, స్థలాలు కోల్పోతున్నవారికి గరిష్ట పరిహారం అందాలన్నారు. వారు శాశ్వతంగా భూములు కోల్పోవాల్సి వస్తున్నందున వారికి పరిహారం గరిష్టస్థాయిలో ఉండే విధంగా చూడాలని చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న వివిధ సమస్యలపై దృష్టి సారించి తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో తెలంగాణ రహదారులపై కేంద్ర మంత్రులకు పలు వినతిపత్రాలు అందించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం నుంచి సాయం కోరారు. ఇప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహించి రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.

తెలంగాణలో రోడ్ కనెక్టివిటీ విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెద్దగా సాయం చేసిందేమీ లేదు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు ఉన్నా కూడా గతంలో రాష్ట్రానికి సహాయ నిరాకరణే జరిగింది. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా.. రాష్ట్రంపై కేంద్రం కనికరం చూపుతుందనుకోలేం. అయితే సీఎం రేవంత్ రెడ్డి అంచనాలు వేరే ఉన్నాయి. ఈసారయినా కేంద్రం నిధుల విషయంలో ఉదారంగా ఉంటుందేమో చూాడాలి.

First Published:  10 July 2024 10:53 AM GMT
Next Story