అధికారిక చిహ్నంపై సీఎం రేవంత్ తుది నిర్ణయం..
గత ప్రభుత్వంలో ఆలె లక్ష్మణ్.. తెలంగాణ చిహ్నాన్ని తయారు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు కళాకారుడు రుద్ర రాజేశం.. నూతన చిహ్నాన్ని రూపొందిస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం కొత్త వెర్షన్, మారిన రాష్ట్ర చిహ్నం విడుదలకాబోతున్నాయి. రాష్ట్ర గీతానికి కీరవాణి ఆల్రడీ స్వరకల్పన చేస్తున్నారు. ఇటు రాష్ట్ర చిహ్నం కొత్త రూపుకూడా దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. తాజాగా మరోసారి రాష్ట్ర చిహ్నం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఇతర నాయకులు పాల్గొన్నారు.
కొత్త చిహ్నం ఎలా ఉంటుంది..?
పాత చిహ్నంలో కాకతీయ కళా తోరణం, చార్మినార్ హైలైట్ అవుతూ కనిపిస్తాయి. కానీ కొత్తదాంట్లో కాకతీయుల తోరణం తీసివేస్తారనే ప్రచారం జరిగింది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఘాటుగా స్పందించింది. తెలంగాణ పాలన పిచ్చిడో చేతిలో రాయిలాగా మారిందని విమర్శించారు కేటీఆర్. అయితే కొత్త చిహ్నం ఎలా ఉంటుందనే విషయం అధికారికంగా బయటకు రాలేదు. నేరుగా జూన్-2న చిహ్నాన్ని విడుదల చేస్తారని, అప్పటి వరకు ఈ చిహ్నంపై వచ్చేవన్నీ ఊహాగానాలే అనుకోవాలి. అయితే సోషల్ మీడియాలో మాత్రం మూడు చిహ్నాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఒకటి ఫైనల్ అవుతుందని అంటున్నారు.
గత ప్రభుత్వంలో ఆలె లక్ష్మణ్.. కాకతీయ కళాతోరణం, చార్మినార్ తో కూడిన తెలంగాణ చిహ్నాన్ని తయారు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు కళాకారుడు రుద్ర రాజేశం.. తెలంగాణ నూతన చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. రెండు మూడు డిజైన్లను ఆయన సీఎం రేవంత్ రెడ్డికి చూపించారు. వాటికి కొన్ని మార్పులను సూచించారు సీఎం. ఈరోజు తుది నిర్ణయం తీసుకునేందుకు మిగతా నేతలతో కలసి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది. చిహ్నం అధికారికంగా బయటకు వస్తే విమర్శలు చెలరేగే అవకాశాలను కొట్టిపారేయలేం.